జనవరిలో నంది నాటక పురస్కారాలు
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:57 AM
నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ కె.ఎస్. విశ్వనాథన్ ఆదివారం ప్రకటించారు.
కందుకూరి అవార్డులు-2026కూ దరఖాస్తుల ఆహ్వానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబరు 20
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ కె.ఎస్. విశ్వనాథన్ ఆదివారం ప్రకటించారు. తెలుగులో రాసిన పద్య నాటికలు, సాంఘిక నాటికలు, బాలల నాటికలు, కళాశాల/ విశ్వవిద్యాలయాల నాటికలు, నాటక రంగంపై రచించిన పుస్తకాల విభాగాల్లో దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాల, విశ్వవిద్యాలయాలు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అలాగే నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న పౌరాణిక, సాంఘిక నాటక కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సమాజాల వారికి రాష్ట్రస్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక పురస్కారం, జిల్లాస్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తామని వెల్లడించారు. దరఖాస్తులను అక్టోబరు 20 నాటికి ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి సంబంధిత పత్రాలతో జతపరచి, ఆయా స్ర్కిప్టులను వచ్చేనెల 26 నాటికి తమకు అందజేయాలని సూచించారు. వివరాలకు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
షెడ్యూల్ విడుదల
నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించారు. దరఖాస్తులు ఆహ్వానించేందుకు ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తారు. డిసెంబరు నాటికి దరఖాస్తులను పరిశీలించి, ప్రాథమికంగా ఎంపిక చేసిన పేర్లను ప్రకటిస్తారు. జనవరిలో తుది జాబితా విడుదల చేసి అదే నెలలో పురస్కారాలను అందిస్తారు. అలాగే జిల్లాకు కనీసం మూడు చొప్పున 28 జిల్లాల కు మొత్తం 84 మంది ప్రముఖులకు కందుకూరి విశిష్ట పురస్కారాలు ఇవ్వనున్నారు. ప్రతిభావంతులైన నటీనటులకు మరో 16 అవార్డులు రిజర్వు చేశారు.
వైఎస్ఆర్ పేరుతో అవార్డు!
కూటమి ప్రభుత్వం రంగస్థల అవార్డులకు వైఎస్ఆర్ పేరు తొలగించింది. అయితే ఈ పురస్కారాలను ఐదుగురు ప్రముఖల పేర్లతో ఇవ్వాలని నిర్ణయించింది. అందులో స్థానం నరసింహారావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావుతో పాటు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరు కూడా ఉండటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి..