Share News

కూటమిది నాటే సంస్కృతి.. వారిది నరికే సంస్కృతి

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:31 AM

పచ్చదనం పెరిగితేనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలుగుతామని ఏపీ గ్రీన్‌ సొసైటీ చైర్మన్‌ కొణిదెల నాగబాబు అన్నారు.

కూటమిది నాటే సంస్కృతి.. వారిది నరికే సంస్కృతి

గత ప్రభుత్వం చెట్లు నరికిందే తప్ప.. మొక్కలు నాటే ఆలోచన చేయలేదు

పచ్చదనంతోనే స్వచ్ఛమైన గాలి: ఏపీ గ్రీన్‌ చైర్మన్‌ నాగబాబు

అమరావతి, మంగళగిరి సిటీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పచ్చదనం పెరిగితేనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలుగుతామని ఏపీ గ్రీన్‌ సొసైటీ చైర్మన్‌ కొణిదెల నాగబాబు అన్నారు. శనివారం ఆయన తన సతీమణి పద్మజతో కలిసి మంగళగిరిలోని అరణ్యారామం ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నందనవనం ప్రాంగణంలో వేప, రావి మొక్కలను నాటారు. అనంతరం రూ.24కోట్లతో నిర్మించే అరణ్యారామం భవన డిజైన్లను పరిశీలించారు. ఈ భవన నిర్మాణ కోసం తొలగించాల్సి వచ్చిన 73 చెట్ల స్థానంలో మరో చోట మొక్కలు నాటడం, 45 చెట్లను సైతం వేరేచోటకు దిగ్విజయంగా తరలించడాన్ని ప్రశంసించారు. ఏపీ గ్రీన్‌ సొసైటీ కార్యకలాపాలకు సంబంధించి సీఎ్‌సఆర్‌ నిధులను సమీకరించే నిమిత్తం పరిశ్రమలు, ఇతర రంగాల ప్రతినిధులకు అవగాహన కల్పించే విషయమై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పరిశ్రమలు, ప్రజలందరూ చురుకైన భాగస్వామ్యం అందించాలని నాగబాబు కోరారు. ‘పచ్చని చెట్లు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. గత ప్రభుత్వం చెట్లను నరకడం తప్ప.. మొక్కలు నాటే ఆలోచనే చేయలేదు. కూటమి ప్రభుత్వానిది నరికే సంస్కృతి కాదు.. నాటే సంస్కృతి’ అని అన్నారు. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ పీవీ చలపతిరావు, గ్రీన్‌ సొసైటీ సీఈవో బీఎన్‌ఎన్‌ మూర్తి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 06:31 AM