‘మై టీడీపీ’ 10 లక్షల రికార్డు
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:17 AM
‘కార్యకర్తే అధినేత’... ఇది తెలుగుదేశం పార్టీ నినాదం మాత్రమే కాదు. అనుసరిస్తున్న ఆచరణాత్మక సిద్ధాంతం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది.
ప్రాంతీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో అరుదైన మైలురాయి
క్షేత్రస్థాయిలో కార్యకర్త కష్టానికి గుర్తింపు.. వారికే పదవులు
అధినాయకత్వంతో నేరుగా అనుసంధానానికి వేదిక
కార్యకర్తల సూచనలకు, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేలా రూపకల్పన
ప్రాంతీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో అరుదైన మైలురాయి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘కార్యకర్తే అధినేత’... ఇది తెలుగుదేశం పార్టీ నినాదం మాత్రమే కాదు. అనుసరిస్తున్న ఆచరణాత్మక సిద్ధాంతం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. పార్టీకి పునాదిగా నిలిచిన నినాదానికి ఆచరణ రూపం ఇస్తూ, సంస్థాగతంగా బలోపేతం చేసేదిశగా చేసిన ‘డిజిటల్ ప్రయాణం’ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. పార్టీకి, కార్యకర్తకు మధ్య వారధిగా నిలిచిన డిజిటల్ వేదిక ‘మై టీడీపీ’ యాప్ ఇప్పుడు మరో అరుదైన మైలురాయిన అధిగమించింది. యాప్‌లో నమోదైన వారి సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో ఇదో పేర్కొన్నదగ్గ చరిత్ర.
పైరవీలు లేకుండానే గుర్తింపు
ఒకప్పుడు గ్రామంలో పార్టీ జెండా మోసే కార్యకర్త కష్టం అధిష్ఠానానికి తెలియడం అంత సులభమయ్యేది కాదు. ఆ పరిస్థితిని ‘మై టీడీపీ’ యాప్ మార్చేసింది. గుర్తింపునకూ పైరవీలపై ఆధారపడాల్సి వచ్చిన కాలాన్ని గతంలోకి నెట్టేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా యాప్‌నకు రూపకల్పన జరిగింది. కష్టపడే ప్రతి కార్యకర్తకు నేరుగా గుర్తింపు లభిస్తోంది. కార్యకర్తలు తాము చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ బూత్ స్థాయిలో... ఏ కార్యకర్త ఎంత కష్టపడుతున్నాడన్న సమాచారం నేరుగా పార్టీ అధినాయకత్వానికి చేరుతుంది. ఆ సమాచారంతోనే స్థానిక ఎన్నికల్లో ఎంతోమంది కార్యక్తలకు కార్పొరేటర్లు, సర్పంచులుగా అవకాశాలు లభించాయి.
కార్యకర్త స్పందన నేరుగా అధినేతకు...
పార్టీ అధినేత సందేశాలు, నాయకత్వం ఇచ్చే సూచనలు, పార్టీ కార్యక్రమాల వివరాలు క్షణాల్లో కార్యకర్తలకు చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు, సమస్యలు... పార్టీ నాయకత్వానికి చేరుతున్నాయి. కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించే సమగ్ర డిజిటల్ వ్యవస్థగా ‘మై టీడీపీ’ పనిచేస్తోంది. ఇదే ఈ యాప్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. కార్యకర్తల సంక్షేమానికీ ఉపయుక్తంగా దీనిని మలచడంలోనూ, నిరంతరాయంగా యాప్‌ను అభివృద్ధి చేయడంలోనూ లోకేశ్ పాత్ర గణనీయమైనది.
చంద్రబాబు, లోకేశ్ నియోజకవర్గాల్లో పర్యటించినపుడు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారితో ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటోలు ‘మై టీడీపీ’ యాప్ ద్వారా నేరుగా కార్యకర్తలకు అందుతున్నాయి. కార్యకర్తలు ఒక్కసారి యాప్‌లో తమ ముఖాన్ని స్కాన్ చేసుకుంటే చాలు... ఆ తర్వాత పార్టీ అధినేతతో, లోకేశ్‌తో ఎప్పుడు ఫొటో దిగినా, అవి యాప్‌లోని ‘ఫొటో బూత్’ విభాగంలోకి వచ్చేస్తాయి. యాప్ ద్వారా అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన కార్యకర్తలను గుర్తించి తన పర్యటనల్లో లోకేశ్ వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనే భరోసాను కల్పిస్తున్నారు.
యాప్‌లో టాప్ నియోజకవర్గాలు ఇవే...
‘మై టీడీపీ’ యాప్‌నకు విశేష స్పందన లభిస్తోంది. యాప్ వినియోగం, పార్టీ కార్యక్రమాల నమోదులో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో... కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం ఉన్నాయి.
కార్యకర్త కష్టానికి గుర్తింపు లభించాలన్నదే లక్ష్యం: లోకేశ్
‘‘క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలి. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలి. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత అవకాశాలు దక్కాలి. ఈ లక్ష్యంతోనే మైటీడీపీ యాప్‌నకు శ్రీకారం చుట్టాం. పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మై టీడీపీ’ యాప్‌లో నమోదైన కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ప్రయాణంలో భాగస్వాములైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ఇదో మైలురాయి: చంద్రబాబు
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘మై టీడీపీ’ యాప్‌ను 10 లక్షల మంది కార్యకర్తలు డౌన్‌లోడ్ చేసుకోవడంపై సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో అరుదైన మైలురాయిగా దీన్ని ఆయన అభివర్ణించారు. ఈ విజయానికి కృషి చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ యాప్ కేవలం సభ్యత్వ నమోదుకే పరిమితం కాకుండా, పార్టీ నాయకత్వానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపును ఇచ్చే శక్తివంతమైన వేదికగా ఈ యాప్ రూపొందిందని తెలిపారు. భారీ స్థాయిలో యాప్ డౌన్‌లోడ్లు నమోదు కావడం కార్యకర్తల అంకిత భావానికి, సాంకేతిక చైతన్యానికి నిదర్శనమని సీఎం కొనియాడారు. పని చేసిన వారిని గుర్తించడంలో ఇలాంటి సాంకేతికతను అధిష్ఠానం ఉపయోగించుకుంటుందని చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్