రెండు జిల్లాల్లో నలుగురు మృతి
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:01 AM
మురసు తుఫాను కారణంగా పలుచోట్ల తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుఫాన్ తీవ్రత ధాటికి బాపట్ల జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో...
పల్నాడులో వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురు
ముగ్గురిని రక్షించిన స్థానికులు.. ఇద్దరు గల్లంతు
నెల్లూరులో వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న ఐదుగురు జాలర్లు సేఫ్
చేజర్లలో బ్యారన్ గోడ కూలి వంద గొర్రెలు మృతి
బాపట్ల, యడ్లపాడు, ఒంగోలు, నెల్లూరు/ గూడూరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను కారణంగా పలుచోట్ల తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుఫాన్ తీవ్రత ధాటికి బాపట్ల జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మరణించారు. విపత్తుల వేళ పునరావాసం కల్పించడానికి జిల్లాలోని చినగంజాం టోల్‌ప్లాజా వద్ద కంటైనర్లతో షెడ్లను ఏర్పాటు చేశారు. గాలుల ధాటికి అది తిరగబడి మీదపడడంతో టోల్‌ప్లాజా ఉద్యోగి ప్రాణాలు విడిచారు. కారంచేడు మండలం దగ్గుబాడులో నీళ్ల ట్యాంకర్ మీద పడి ఓ మహిళ మృతి చెందగా, ఇంకొల్లు మండలం గొల్లపాలెంలో ఇంటిపైకప్పు రేకులు మీద పడి మరొకరు మృత్యువాత పడ్డారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయరహదారి బైపాస్ మార్గంలోని అండర్‌పాస్‌లోకి మంగళవారం వరదనీరు ఒక్కసారిగా పొంగి ప్రవహించింది.
ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకోగా వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఇద్దరు గల్లంతయ్యారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంగోలు-చీరాల జాతీయ రహదారిపై ఉప్పుగుండూరు టోల్‌గేటు వద్ద విధులలో ఉన్న ఆకాశ్ అనే యువకుడిపై గాలుల ధాటికి పక్కనే ఉన్న కంటైనర్ బాక్సు పడటంతో మృతిచెందాడు. ఒంగోలు రూరల్ మండలం చేజర్లలో బ్యారన్ గోడ కూలి వంద గొర్రెలు మృతిచెందాయి.
నెల్లూరు జిల్లాలో వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులను జిల్లా యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. చీరాల మండలం ఓడూరుకు చెందిన గరికాన కోదండం, మారడ జగన్నాథం, యరిపిల్లి రమణ, సొరడ పోలరాజు, జి.అప్పారావు గత నెల 29న బోటులో వేటకు వెళ్లారు. తుఫాన్ హెచ్చరికలు పంపాక కూడా స్వస్థలానికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, అధికారులు గాలింపు చేపట్టారు.
కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో జిల్లా తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పెట్రోలింగ్ బోటు ద్వారా గాలింపు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మత్స్యకారుల బోటును గుర్తించి సురక్షితంగా కృష్ణపట్నం పోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం స్వస్థలమైన చీరాలకు పంపారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం