Share News

ఒంగోలు వద్ద తీరం దాటిన తుఫాన్‌

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:07 AM

తీవ్ర తుఫాన్‌ ‘మురసు’ మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలుకు అతి సమీపాన (ఉత్తరాన) తీరం దాటింది.

ఒంగోలు వద్ద తీరం దాటిన తుఫాన్‌

  • కోస్తా జిల్లాల్లో కుంభవృష్టి, పెనుగాలులు.. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు

  • 7 వరకు కోస్తా తీరం వెంబడి మోస్తరు వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, విజయవాడ/మచిలీపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తీవ్ర తుఫాన్‌ ‘మురసు’ మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలుకు అతి సమీపాన (ఉత్తరాన) తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు కుండపోతగా వర్షాలు కురిశాయి. తీరం దాటిన తరువాత తుఫాన్‌ ఉత్తర వాయవ్యంగా దిశ మార్చుకునే క్రమంలో మరింత నెమ్మదిగా పయనించింది. దీంతో పలు జిల్లాల్లో మేఘాలు కమ్మి భారీ నుంచి అతి భారీగా, అక్కడక్కడ కుంభవృష్టి కురిసింది. తుఫాన్‌ మంగళవారం మధ్యాహ్నానికి బాపట్లకు 40 కిలోమీటర్లు పశ్చిమ వాయవ్యంగా, విజయవాడకు 80 కిలో మీటర్లు నైరుతిగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి మంగళవారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాన్‌ తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో నిజాంపట్నం ఓడరేవులో ఏడు, మచిలీపట్నంలో ఆరో నంబర్‌ డేంజర్‌ సిగ్నల్స్‌, రాష్ట్రంలోని మిగిలిన ఓడరేవుల్లో మూడో నంబర్‌ ప్రమాద సూచికను ఎగురవేశారు. తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 7.30 గంటల వరకు కోస్తా జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా అసాధారణ రీతిలో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


నేడు కోస్తా తీరం వెంట భారీ వర్షాలు

మురసు తుఫాను ఉమ్మడి కృష్ణా జిల్లాపై తన ప్రభావం చూపింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం రాత్రివరకు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం సమయంలో తుఫాను తీరందాటిన తరువాత మరింతగా వర్షాలు కురిశాయి. నేడు కోస్తాతీరం వెంబడి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 7వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి పలుప్రాంతాల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌ జైన్‌ తెలిపారు.

రెండు అధిక పీడనాల ప్రభావంతో నెమ్మదిగా పయనం

మురసు తుఫాన్‌ సోమవారం మధ్యాహ్నం నుంచి తీరం దిశగా నెమ్మదిగా రావడానికి గల కారణాలను ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు విశ్లేషించారు. దక్షిణ భారతదేశంపై అరేబియా సముద్రం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న రెండు అధిక పీడనాలు బలంగా ఉండడంతో తుఫాన్‌ పయనంలో వేగం తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు.

భూ ఉపరితలం నుంచి దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తుఫాన్లు పయనిస్తుంటాయి. రెండు అధిక పీడనాలు బలంగా ఉండడంతో తుఫాన్‌ వేగం బాగా తగ్గిందని, దీంతో సోమవారం రాత్రి నుంచి తీరం దాటేంత వరకు గంటకు ఆరేడు కిలోమీటర్లు వేగంతో పయనించిందని వెల్లడించారు. ఆ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో బాపట్ల, చీరాల, ఒంగోలు ప్రాంతాలు దాటి ఉత్తర వాయవ్యంగా నెమ్మదిగా పయనించిందని, దీంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయని, పెనుగాలులు వీచాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:10 AM