‘మురసు’.. తీరం దాటే వేళ ఘోరం!
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:36 AM
మురసు తుఫాన్ వేళ తమిళనాడుకు చెందిన ఓ బోటు మునిగి ఐదుగురు జాలర్లు మృత్యువాతపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు.
తుఫాన్ గాలులతో 3న మునిగిపోయిన ఫిషింగ్ బోటు
అందులో తొమ్మిది మంది తమిళ జాలర్లు
ఐదుగురి మృతదేహాలు లభ్యం
మిగిలిన నలుగురి కోసం గాలింపు
కొత్తపట్నం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ వేళ తమిళనాడుకు చెందిన ఓ బోటు మునిగి ఐదుగురు జాలర్లు మృత్యువాతపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 29వ తేదీన తమిళనాడు మూడు మత్స్యకార బృందాలు మూడు బోట్లతో వేటకు బయలుదేరాయి. రెండు బృందాల మత్స్యకారులు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రామాయపట్నం పోర్టు సమీపంలో తమ బోట్లను నిలుపుకొన్నారు. మూడో బోటులోని మత్స్యకారులు పక్కిరిసామి సూరియా(49), కుప్పన్(48), మోహన్(47), రాజేశ్(52), మురుగన్ (48), కుప్పుసామి(58), విజయకాంత్(44), అరవింద్(40), నారాయణన్(57) వేట చేస్తూ ఏపీలోని నిజాంపట్నం రేవులో ఉన్నారు.
వారిని రామాయపట్నం వైపు రావాలంటూ మిగతా వారు సమాచారం అందజేశారు. దీంతో మూడో తేదీ ఉదయం నిజాంపట్నం రేవు నుంచి బయలుదేరిన మత్స్యకారుల బృందం బోటు కొత్తపట్నం పల్లెపాలేనికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో తుఫాన్ అలల ధాటికి సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. అందులో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారుల్లో ఐదుగురు జల సమాధి అయ్యారు. గురువారం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన నాలుగు మృతదేహాలను చూసి స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఈ పెను విషాదం బయటపడింది.
మరో మృతదేహాన్ని కోస్టుగార్డులు ఒడ్డుకు చేర్చారు. మిగిలిన మత్స్యకారుల ఆచూకీ కోసం ఆంధ్ర, తమిళనాడు ప్రభుత్వాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా చార్టర్ ఫ్లయిట్ నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా సముద్రం పైన వెతకటం కోసం పంపించింది. తమిళనాడు నుంచి మత్స్యకారుల బంధువులు కొత్తపట్నం తీరానికి చేరుకుంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ