Share News

వరదలెత్తుతున్న వాగులు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:42 AM

మురసు తీవ్ర తుఫాను తీరం దాటి నాలుగురోజులైనా, కోస్తా తీరం ఇంకా కోలుకోలేదు. తుఫాను మిగిల్చిన అంధకారం నుంచి ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు.

వరదలెత్తుతున్న వాగులు

  • నాలుగు రోజులైనా వదలని ‘మురసు’ ప్రభావం

  • ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్న ఎర్ర కాలువ, యనమదుర్రు డ్రెయిన్‌

  • పూర్తిగా కుదుటపడని దక్షిణ కోస్తా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మురసు తీవ్ర తుఫాను తీరం దాటి నాలుగురోజులైనా, కోస్తా తీరం ఇంకా కోలుకోలేదు. తుఫాను మిగిల్చిన అంధకారం నుంచి ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. ఇటు మురసు, అటు అర్నబ్‌ కురిపించిన కుండపోత వర్షాలతో అత్యంత ప్రమాదకరంగా పొంది పొర్లుతున్న వాగులు, గెడ్డలకు ఎగువ రాష్ట్రం నుంచి వస్తున్న వరద తోడై గోదావరి జిల్లాలను వణికిస్తోంది.

ఎర్రకాలువ వరదకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లో సుమారు పది వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కోతలకు సిద్ధం చేసిన వరి పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన ధాన్యాన్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి. తాడేపల్లిగూడెం మండలం యనమదుర్రులో రైతులు అర కిలోమీటరు దూరం నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్లపై ఆరబెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు1,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.


భయపెడుతున్న డ్రెయిన్లు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రులోని నందమూరు అక్విడెక్ట్‌ వద్ద వరద నీరు 40 అడుగుల స్కేల్‌ను దాటి ప్రవహించింది. దీంతో గ్రామాల్లోకి వరద నీరు చేరింది. తాడేపల్లిగూడెం- నిడదవోలు మార్గంలో రవాణా ఆగిపోయింది. యనమదుర్రు డ్రెయిన్‌ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణలోని బేతుపల్లి జలాశయం అలుగు నుంచి తమ్మిలేరుకు వరద పోటెత్తటంతో ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు కాజ్‌వే అప్రోచ్‌ రోడ్డుకు రెండుచోట్ల భారీ గండ్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఎర్రకాలువ పోటెత్తింది. కోట సత్తెమ్మ తల్లి ఆలయం పూర్తిగా ఎర్ర కాలువ వరద ముంపునకు గురైంది.

పూర్తిగా కోలుకోని కోస్తా

తుఫాను తీరం దాటిన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాలు ఇంకా ఆ బీభత్సం నుంచి బయటపడలేదు. తీరం దాటే వేళ వంద కిలోమీటర్ల వేగంతో ఈడ్చికొట్టిన గాలులతో కూలిన వేలాది వృక్షాలు, విద్యుత్‌ స్తంభాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. దీంతో జిల్లాలోని 157 సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.

ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద

విజయవాడ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుతోంది. ఎగువ నుంచి 14,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. 20 గేట్లను అడుగు మేర ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వజినేపల్లి నుంచి 986, కీసర నుంచి 13,014, పాలేరు నుంచి 241 క్యూసెక్కుల నీరు బ్యారేజీలోకి వస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:45 AM