Share News

వరద ఉధృతికి విలవిల

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:31 AM

మురసు తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎర్రకాలువ, కొండవాగులు పొంగిపొర్లడంతో పంటలు, నివాసాలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ఉధృతికి విలవిల

  • పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు అతలాకుతలం

  • ఎర్రకాలువ, కొండవాగుల ఉగ్రరూపం

  • నీట మునిగిన పంటలు, ఇళ్లు

  • పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

  • పోలవరం జిల్లాలో గిరిజన మహిళ మృతి

  • తూర్పుగోదావరి జిల్లా కొవ్వాడ కాల్వలో వ్యక్తి గల్లంతు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మురసు తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎర్రకాలువ, కొండవాగులు పొంగిపొర్లడంతో పంటలు, నివాసాలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం, వీరంపాలెం, పట్టింపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాధపురం, మారంపల్లి, నందమూరు గ్రామాల పంట పొలాలను ఎర్రకాలువ ముంచెత్తింది. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాలు ఇంకా ముంపు నుంచి బయటపడలేదు. తణుకులోని శ్రీ ఉమా సిద్ధేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి నీరు చేరింది. పోలవరం మండలం రామన్నపాలెంలో బుధవారం సాయంత్రం కొవ్వాసి చినదుర్గ అనే మహిళ కొండవాగు దాటుతూ గల్లంతయ్యారు.

గురువారం ఆమె మృతదేహం లభ్యమైంది. ఇదే మండలంలో కొవ్వాడ కాలువకు గండ్లు పడి పంటలు నీటమునిగాయి. టి.నరసాపురం మండలంలో వరద ఉధృతికి బండివారిగూడెం వద్ద వంతెన కొట్టుకుపోగా, మక్కినవారిగూడెం-కొల్లివారిగూడెం మధ్య రహదారి ధ్వంసమైంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు ప్రధాన రహదారులు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. వేలేరుపాడు, అశ్వరావుపేట ప్రధాన రహదారిపై పలుచోట్ల గండ్లుపడ్డాయి. వేలేరుపాడు, రుద్రమ్మకోట మధ్య కాజ్‌వే కొట్టుకుపోయింది.


కొట్టుకుపోయిన మేనమామ.. మేనకోడలు సురక్షితం

తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వాడ కాల్వ ప్రవాహంలో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. బుధవారం కురిసిన కుండపోత వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడంతో కొవ్వాడ కాల్వ ఉధృతంగా మారింది. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన మేడిది విజయ్‌కుమార్‌ తన మేనకోడలిని దేవరపల్లిలో బస్సు ఎక్కించేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తూ.. అన్నదేవరపేట, చిట్యాల గామ్రాల మధ్య కొవ్వాడ నీటి ప్రవాహంలో వాహనంతో సహా కొట్టుకుపోయారు. అయితే, మేనకోడలు ఒక చెట్టుకొమ్మును పట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. ఎన్‌డీఆర్‌ఎం బృందాలను పంపి విజయ్‌కుమార్‌ కోసం గాలింపు చేపడుతున్నట్లు తహసీల్దార్‌ మహాలక్ష్మి చెప్పారు.

నెల్లూరు జిల్లాలో నిండుతున్న చెరువులు

నెల్లూరు జిల్లావ్యాప్తంగా గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలమట్టం పెరుగుతోంది. అదే సమయంలో ఎండిన చెరువుల్లోకి నీరు చేరుతోంది. రెండు నెలల క్రితం జిల్లాలోని 648 చెరువులు ఎండిపోగా. ఇప్పుడు ఆ సంఖ్య 558కు తగ్గింది. కాగా, నెల్లూరు నగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి.

నేడూ కోస్తా, సీమలో వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శుక్రవారం అల్లూరి, పోలవరం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:31 AM