తక్షణ ఆర్థిక సాయం అందించాలని అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
ABN , Publish Date - Nov 04 , 2026 | 08:29 AM
ఏపీని వరుస తుపాన్లు తీవ్రంగా దెబ్బతీశాయని.. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు.
అమరావతి, నవంబర్ 4: ఏపీని వరుస తుపాన్లు తీవ్రంగా దెబ్బతీశాయని.. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
గతంలో వచ్చిన 'అర్నబ్' తుపాను నష్టం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే తాజాగా 'మురసు' తుపాను మరోసారి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని లేఖలో వివరించారు. వరుస ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలోని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తుపాను ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఒక తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మరో తుపాను రూపంలో ఎదురైన విపత్తు ఆర్థికంగా మరింత భారంగా మారిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
మురసు తుపాను కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రాథమికంగా రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం నష్టంలో దాదాపు 94 శాతం వ్యవసాయ రంగానిదేనని వెల్లడించారు. తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని వివరించారు. వరుస తుపాన్లతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించాలని, నష్టాన్ని అంచనా వేసి తక్షణమే ఆర్థిక సహాయం విడుదల చేయాలని అమిత్ షాను సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి అందే సహాయం బాధిత రైతులకు, ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు రాష్ట్రంలో పునరుద్ధరణ, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం