మురసు ముంచింది
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:01 AM
పట్టపగలే చిమ్మచీకట్లు.. కూలిన చెట్లూ, విరిగిన కరెంటు స్తంభాలు.. ఎడతెరిపి లేకుండా ఏడెనిమిది గంటలపాటు కుండపోత.. భీతిగొలిపే గాలి.. హోరుమంటూ సముద్ర ఘోష..
దక్షిణ కోస్తాలో బీభత్సం
ఒంగోలు దగ్గర్లో తీరం దాటిన తుఫాను
125 కిలోమీటర్ల వేగంతో గాలులు
భారీగా కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
మచిలీపట్నం, బాపట్ల, చీరాల, ఒంగోలు
తీరం వెంట ఏడెనిమిది గంటలపాటు కుండపోత
విజయవాడ, గుంటూరులో భారీ వర్షాలు
‘అర్నబ్’ దెబ్బ నుంచి కోలుకునేలోపే
రైతులపై మరో ఉత్పాతం.. మళ్లీ మునిగిన వరి
పల్నాడు జిల్లా మర్రిపాలెంలో
అత్యధికంగా 26.3 సెంటీమీటర్ల వర్షం
జాతీయ రహదారులపైకి భారీగా నీరు
పలు విమానాలు, రైళ్లు రద్దు.. నలుగురు మృతి
మరో 2 రోజులు అప్రమత్తంగా ఉందాం: సీఎం
పట్టపగలే చిమ్మచీకట్లు.. కూలిన చెట్లూ, విరిగిన కరెంటు స్తంభాలు.. ఎడతెరిపి లేకుండా ఏడెనిమిది గంటలపాటు కుండపోత.. భీతిగొలిపే గాలి.. హోరుమంటూ సముద్ర ఘోష.. వణికించే చలి! ‘మురసు’ తుఫాన్ సృష్టించిన బీభత్సమిది! ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామునే తీరం దాటినా... కొన్ని గంటలపాటు కుంభవృష్టి కురుస్తూనే ఉంది. మచిలీపట్నం, బాపట్ల, చీరాల, ఒంగోలు తీరాల్లో రాకాసి అలలు ఎగసిపడగా... గంటకు 100-125 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పలుచోట్ల జాతీయ రహదారులపైకి నాలుగు అడుగుల ఎత్తుకు నీరు చేరగా, బాపట్లలో 30 అడుగుల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ, విజయవాడకు రావాల్సిన 16 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరవై రైళ్లు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సమన్వయం, రియల్ టైమ్ పర్యవేక్షణతో ‘అర్నబ్’ను ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘మురసు’ విషయంలోనూ అదే అప్రమత్తత కనబరిచింది. తక్షణ సహాయ చర్యలు చేపట్టింది.
తీవ్ర తుఫాను ‘మురసు’ దక్షిణ కోస్తాను అతలాకుతలం చేసింది. రాకాసి అలల కల్లోలం...గాలుల బీభత్సం.. వానల హోరుతో రాష్ట్రాన్ని వణికించిన తుఫాను, ఒంగోలుకు తూర్పు వైపున 18 కిలోమీటర్ల దూరంలోని కొత్తపట్నం వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక తీరం తాకింది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 100-125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి. గాలుల తీవ్రతకు మహా వృక్షాలు, కరెంటు స్తంభాలు నిలువునా కూలిపోయాయి. సోమవారం అర్ధరాత్రి తర్వాత మురసు తన ప్రభావం చూపెట్టింది. వేకువజాముకు గాలుల హోరుకు కుండపోత వర్షం తోడవడంతో దక్షిణ కోస్తా చిగురుటాకులా వణికింది.
మచిలీపట్నం, బాపట్ల, చీరాల, ఒంగోలు తీరం వెంబడి ‘మురసు’ బీభత్సం సృష్టించింది. వాటి పరిధిలోని విజయవాడ, గుంటూరును చిమ్మచీకట్లు కమ్మేశాయి. రోజుంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఈ నగరాలు తడిచి ముద్దయ్యాయి. మంగళవారం సాయంత్రం వరకు తుఫాను తీవ్రత కొనసాగింది. అర్ధరాత్రికి వర్షం తగ్గుముఖం పట్టి గాలుల తీవ్రత మాత్రం కొనసాగింది. మొన్నటి అర్నబ్ తుఫాన్ ధాటికి లక్షలాది హెక్టార్లలో ముంపునకు గురైన పంట నష్టం లెక్క ఇప్పుడిప్పుడే తేలుతోంది. వరద నీరు దిగిన పంట చేలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
ఇంతలోనే విరుచుకుపడ్డ ‘మురసు’ అన్నదాత వెన్నును సాంతం విరిసేసింది. తీరం దాటిన ప్రకాశం జిల్లాను దాదాపు ఏడెనిమిది గంటలు పాటు హోరుగాలి, జోరు వర్షం వణికించాయి. భారీవర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఎన్‌జీపాడు మండలంలోని కొత్తకోట, ముప్పాళ్ల వాగులు పొంగి పలు గ్రామాల చుట్టూ నీరు చేరింది. కొత్తపట్నం మండలంలోని నల్లవాగు, అలాగే పంగులూరు మండలంలోని వాగులు పొంగి ఆ మార్గాలలో రాకపోకలు నిలిచిపోయాయి. ఒంగోలులోని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు విగ్రహం భారీవృక్షం విరిగిపడటంతో కూలిపోయింది.
సూర్యలంక తీరంలో...
బాపట్లలో సముద్రం 30 అడుగుల ముందుకు చొచ్చుకువచ్చింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో తీర ప్రాంతాలు వణికాయి. సూర్యలంక తీరంలో షో లైట్స్ కోసం ఏర్పాటు చేసిన పోల్స్ గాలుల ధాటికి నేలకొరిగాయి. నిజాంపట్నం హార్బర్‌లో పదో నెంబరు హెచ్చరిక కొనసాగింది. జిల్లావ్యాప్తంగా సగటున 16 సెం.మీ. వర్షం కురిసింది.
చకచకా..
తుఫాను తీరం దాటేప్పుడు సృష్టించిన విధ్వంసానికి రోడ్లపై పడిన చెట్లు, కరెంటు స్తంభాలను, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అధికార యంత్రాంగం తొలగించగలిగింది. పట్టణాలు, పల్లెలకు చాలావరకు కరెంటును పునరుద్ధరించింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీసు విభాగాలు జోరువాన,ఈదురుగాలుల్లోనూ శ్రమించాయి.బాపట్ల జిల్లాలో పెనుగాలుల ధాటికి 332 వృక్షాలు పడిపోయాయి. అయితే, గంటలోనే వాటిని తొలగించి రోడ్లు క్లియర్ చేశారు. సూర్యలంక బీచ్‌కు వెళ్లేరోడ్డులో భారీవృక్షం కూలిపడగా, అరగంటలోనే దానినితొలగించారు.
మర్రిపాలెంలో 26.3 సెంటీమీటర్ల వర్షం
మంగళవారం ఉదయం 8.30నుంచి రాత్రి 10 గంటల వరకు పల్నాడు జిల్లా మర్రిపాలెంలో అత్యధికంగా 26.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా గణపవరంలో 24.6, చిరుమామిళ్లలో 23.9, గోవిందాపురంలో 21.6, బాపట్ల జిల్లా కోనంకిలో 21.3, మార్టూరులో 20.7 సెం.మీ. వర్షం పడింది.
అంధకారంలో...
వర్షం కన్నా గాలుల తీవ్రత, అది కూడా గంటల కొద్ది ఉండటంతో ఒంగోలు, పరిసర మండలాల్లో వందలాది చెట్లు విరిగిపడ్డాయి. ఒక్క ఒంగోలులోనే దాదాపు 500 చెట్లు నేలకొరిగాయి. చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడటంతో చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు రెండు వేల స్తంభాలు కూలినట్లు సమాచారం. ఆ ప్రభావం సరఫరాపై తీవ్రంగా పడింది. ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచింది.
ఒంగోలులోని కొన్నిప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నానికి, మరికొన్ని చోట్ల రాత్రికి విద్యుత్ పునరుద్ధరించగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అంధకారం కొనసాగింది. మురసు ప్రభావంతో బాపట్ల జిల్లాలో 800 స్తంభాలు కూలిపోయాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే జిల్లా అంధకారంలోకి వెళ్లింది. బాపట్లతో పాటు రేపల్లె, చీరాల, వేటపాలెం, మార్టూరు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రానికి బాపట్ల, రేపల్లెలో కరెంటు పునరుద్ధరించారు.
చీరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కరెంటు అందించడానికి సిబ్బంది రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం వరకూ వర్షం కురవగా, ఆ తర్వాత తెరపిచ్చింది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 8.9 మి.మీ వర్షపాతం నమోదైంది.
జాతీయ రహదారిపైకి నీళ్లు..
తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లాలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట, నరసరావుపేట మండలాలు అతలాకుతలమయ్యాయి. చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపైకి నీళ్లు చేరాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి తాతపాడు-బొల్లాపల్లి టోల్ ప్లాజా మార్గంలో జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. మార్టూరు ఎంపీడీవో కార్యాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది.
గోదావరి జిల్లాల్లో..
మురసు తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో ఏడు గంటల పాటు కుండపోత పడింది. వాగులు, వంకలు, చెరువుల్లో నీరు పొంగిపొర్లింది. కాకినాడ నగరంలో పెద్దఎత్తున వర్షం నీరు చేరి ఏరులై పారింది. రాజమహేంద్రవరంతో పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండవాగులు పొంగాయి.
గట్లు, చేలు ఏకమై..
అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిని భారీ వర్షాలకు పొలంలో ఉండిపోయిన నీరు తగ్గుమఖం పడుతున్న సమయంలోనే, మురసు తుఫాను విరుచుకుపడటంతో రైతులు కుంగిపోయారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు చోట్ల గట్లు, చేలను ఏకం చేస్తూ పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. బాపట్ల జిల్లాలో 34,500 హెక్టార్ల వరి దెబ్బ తింది. 2,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపు బారిన పడినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రాథమికంగా తేల్చాయి. 500 హెక్టార్లలో మినుము నీళ్లపాలైంది.ఙ ఏలూరు జిల్లాలో 13,272 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలు, 484 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురై దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి చేలల్లో అడుగులోతు నీరు చేరింది. పుంతరోడ్లు, గట్లు ఏకమయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం