‘మురసు’ తుఫాన్ నష్టం రూ.1918కోట్లు
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:34 AM
మురసు తుఫాన్ ప్రభావంతో వివిధ జిల్లాల్లో రూ.1918కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.43లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.
1.43లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
ప్రాథమిక అంచనాలు.. కేంద్రానికి నివేదిక
నష్టాలు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష
నేడు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ ప్రభావంతో వివిధ జిల్లాల్లో రూ.1918కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.43లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. మురసు తుఫాన్ నష్టాలు, సహాయక చర్యలపై గురువారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఇతర శాఖల వారీగా జరిగిన నష్టం, జరుగుతున్న సహాయక చర్యల వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారుల మరమ్మతులు, తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు.
శుక్రవారం తాను స్వయంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తానని సీఎం తెలిపారు. మరుసు తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదికను త్వరితగతిన తయారు చేసి, కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పునరుద్ధరణ పనులను శరవేగంగా నిర్వహించి, అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు.
శరవేగంగా పునరుద్ధరణ పనులు
నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి 48-72గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా బాపట్ల జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు చొప్పున 8 మంది చనిపోయినట్లు చెప్పారు. ‘ఏపీసీపీడీఎల్‌లో ప్రభావిత 11కేవీ ఫీడర్లు 1,103. పునరుద్ధరించినవి 871. 11కేవీ విద్యుత్ స్తంభాలు 3,946. పునరుద్ధరించినవి 1,493. ఏపీఎస్పీడీసీఎల్‌లో 11 కేవీ ఫీడర్లన్నీ పునరుద్ధరించాల్సి ఉంది. ఏపీట్రాన్స్‌కో పరిధిలో 25 హైటెన్షన్ ఫీడర్లలో 21 పునరుద్ధరించారు.
ఆర్‌అండ్‌బీ కింద దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా రహదారులు 760. పంచాయతీరాజ్‌లో దెబ్బతిన్న రోడ్లు 204 కిలోమీటర్లు. రాష్ట్రవ్యాప్తంగా 31,428 టవర్లలో 97.1శాతం పునరుద్ధరించారు. బాపట్ల, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో టవర్లు పునర్ధురించాల్సి ఉంది. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 336చోట్ల డ్రైనేజీ అడ్డంకులు తొలగించారు. 5,515 పారిశుధ్య బృందాలు, 1,489 జనరేటర్లు పని చేస్తున్నాయి. 10 వరద ప్రాంతాలకు 8 చోట్ల పునరుద్ధరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాంతాల్లో రాకపోకలు పునరుద్ధరించాల్సి ఉంది. దెబ్బతిన్న విద్యుత్, రహదార్లు, తాగునీటి వ్యవస్థల పునరుద్ధరణతో పాటు ఇతర మౌలిక వసతుల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి’ అని అధికారులు సీఎంకు వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ