Share News

నష్టం అపారం

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:37 AM

తీవ్ర తుఫాన్‌ ‘మురసు’ తీరం దాటినా, కోస్తా జిల్లాలను వర్షం వదలలేదు. అనేకచోట్ల బుధవారం భారీ నుంచి అతిభారీగా, పలుచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. రైతాంగానికి తీరని నష్టాలను మిగిల్చాయి. ‘అర్నబ్‌’ దెబ్బకు కుంగిపోయిన అన్నదాతను ‘మురసు’ మరింత ముంచేసింది.

నష్టం అపారం

  • రోజంతా వానలు.. 16 జిల్లాల్లో కుండపోత

  • విజయవాడలో దంచికొట్టిన భారీ వర్షం

  • వాగుల వరదతో లోతట్టు గ్రామాలకు ముంపు

  • పొట్ట దశ వరి మునకతో రైతుకు తీరని నష్టం

  • గోదావరి జిల్లాలను ముంచెత్తిన వానలు

  • కాకినాడ జీజీహెచ్‌లోని వార్డుల్లోకి నీరు

  • రాజమహేంద్రవరంలో చెరువుల్లా రోడ్లు

  • ‘మురసు’ జిల్లాల్లో సీఎం ఏరియల్‌ సర్వే

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తీవ్ర తుఫాన్‌ ‘మురసు’ తీరం దాటినా, కోస్తా జిల్లాలను వర్షం వదలలేదు. అనేకచోట్ల బుధవారం భారీ నుంచి అతిభారీగా, పలుచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. రైతాంగానికి తీరని నష్టాలను మిగిల్చాయి. ‘అర్నబ్‌’ దెబ్బకు కుంగిపోయిన అన్నదాతను ‘మురసు’ మరింత ముంచేసింది. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరి, తుఫాను తీరం దాటిన 24 గంటల తర్వాత కూడా నీటిలోనే ఉంది. వరుస వానలతో వాగులు, గెడ్డలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు, ఏజెన్సీ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బుధవారం కొన్ని గంటలపాటు కోస్తా తీరంలో వానలు దంచికొట్టాయి. సాయంత్రం ఒక గంట విజయవాడలో కుండపోత పడింది. 16 జిల్లాల్లో రోజంతా వానలు పడుతూనే ఉన్నాయి. పెదవాగు ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో వరద పోటెత్తింది.

దీంతో ప్రాజెక్టుకు దిగువన ఉన్న వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరినగర్‌, వంటిబండ, గుళ్లవాయి, సోందేగొల్లగూడెం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కమ్మరిగూడెంలో వరద సుమారు ఐదడుగుల పైనే చేరుకోవడంతో ఇళ్లలోని వస్తువులు మునిగిపోయాయి. అల్లూరినగర్‌లో ఒక ఇల్లు కూలిపోయింది. పెదవాగు పరివాహక ప్రాంతంలో సాగు చేసిన వరి, మిర్చి మొక్కజొన్న అపరాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేలేరుపాడు, రుద్రమ్మకోట మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి కాజ్‌వే పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఇళ్లల్లోకి పెద్దఎత్తున నీరు చేరింది. కాకినాడ కలెక్టరేట్‌, జీజీహెచ్‌, ఆర్టీసీ కాంప్లెక్సుల్లోకి నీరు చేరింది. జీజీహెచ్‌లోని సర్జికల్‌ వార్డులు, గైనకాలజీ వార్డుల్లోకి నీరు వచ్చింది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి కాకినాడ జిల్లాలో సగటున 4.87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.


గురువారం కూడా ఆ సెలవును పొడిగించారు. రాజ మహేంద్ర వరంలో కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులను తరపిం చాయి. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి వర్షం కురిసింది. తుఫాన్‌ ప్రభావిత బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పర్చూరు వాగు ఉధృతి భయపెడుతోంది. కారంచేడు వద్ద మొండి వాగు, ఉప్పువాగు, పోలూరు వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

నీళ్లు.. కన్నీళ్లు..

బాపట్ల జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో 90 శాతం వరి పంటే ఉంది. 800 కరెంటు స్తంబాలు కూలాయి. తుఫాను పశ్చిమగోదావరిని జలదిగ్బంధం చేసింది. ఎర్రకాలువ ఉధృతిలో తాడేపల్లిగూడెం రూరల్‌ మండల పరిధిలోని గ్రామాల్లో పంటపొలాలు ముంపుబారిన పడ్డాయి. అర్నబ్‌ తుఫానులో గాలులకు జిల్లా వ్యాప్తంగా వరిపొలాలు నేలవాలాయి. కొంతమేర అయినా సరే పంట వస్తుందని రైతుల్లో ఆశ ఉండేది. మురసు తుఫాను కారణంగా జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. దాంతో దాదాపు లక్ష ఎకరాల్లో వరి ముంపుబారిన పడింది.


ఎన్నికలకు గండం

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ మొదలుకుని విద్యుత్‌ వరకు ఆటంకాలు ఉన్నాయని, అక్కడ పరిషత్‌ ఎన్నికల నిర్వహణ కష్టమని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఈసీకి లేఖ రాశారు. కానీ అంతిమంగా అక్కడ కూడా ఎన్నికలు జరపడానికే ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాకినాడ జిల్లాలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు బుధవారం వర్షం అడ్డంకిగా మారింది.

అందుకే కుండపోత..

మురసు తుఫాను బుధవారం ఉదయానికి వాయుగుండంగా, మధ్యాహ్నం సమయానికి తీవ్ర అల్పపీడనంగా మారి తూర్పు తెలంగాణ, దానికి ఆనుకుని ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో కొనసాగుతోంది. బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయానికి అల్పపీడనంగా మరింత బలహీనపడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, దానికి ఆనుకుని తెలంగాణ మీదుగా కోస్తా తీరానికి సమాంతరంగా ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశావైపుగా పయనించడంతో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చాలా జిల్లాల్లో వర్షం పడింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:39 AM