Share News

కాయ్‌ రాజా కాయ్‌!

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:33 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే బెట్టింగ్‌ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. అభ్యర్థుల గెలుపోటములపై పందేలను పరుగులు తీయిస్తున్నారు.

కాయ్‌ రాజా కాయ్‌!

  • బెజవాడలో 10-20 లక్షల వరకు

  • డివిజన్లను బట్టి బెట్టింగ్‌ బాబులు పోటాపోటీ

  • కొందరు అగ్రిమెంట్లు.. మరికొందరు అప్పులు చేసి

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే బెట్టింగ్‌ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. అభ్యర్థుల గెలుపోటములపై పందేలను పరుగులు తీయిస్తున్నారు. విజయవాడలో డివిజన్ల స్థాయిలో బెట్టింగ్‌లను జోరుగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు పందేల వైపు చూస్తున్నారు. మేయర్‌ అభ్యర్థులపై కంటే కార్పొరేటర్‌ అభ్యర్థుల పైనే భారీగా పందేలు వేస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 86 డివిజన్లు ఉన్నాయి. 64వ డివిజన్‌ టీడీపీ ఖాతాలో పడింది. ఇక్కడి నుంచి వీరమాచనేని లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 85 డివిజన్లలో పోటీలో ఉన్న కార్పొరేటర్‌ అభ్యర్థులపై పోటాపోటీగా పందేలు నడుస్తున్నాయి.

3 కేటగిరిల్లో పందేలు

మూడు విధాలుగా పందేలు కడుతున్నారు. పార్టీలు, అభ్యర్థులు, మెజారిటీలు.. ఇలా మూడు కేటగిరిల్లో బెట్టింగ్‌ బాబులు పందేలు నడుతుపుతున్నారు. కూటమి గెలుచుకునే సీట్లు, వైసీపీకి వచ్చే డివిజన్లపై పందేలు జరుగుతున్నాయి. ఒక్కో డివిజన్‌లో రూ.10-20 లక్షల వరకు పందేలు జరుగుతున్నాయి. పందెం రాయుళ్లు తమకు అత్యంత నమ్మకస్తుల వద్ద నగదును భద్రపరుచుకుంటున్నారు. కొంతమంది అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. తమ అభిమాన అభ్యర్థి కచ్చితంగా గెలుస్తాడని భావిస్తున్నవారు అప్పు చేసి మరీ పందెంలో పేరు రాయించుకుంటున్నారు.


ఒక్కోచోట ఒక్కోలా...

బెట్టింగ్‌లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతున్నాయి. క్లాస్‌ ఏరియాల్లో ఒక విధంగా, మాస్‌ ఏరియాల్లో మరో విధంగా నడుస్తున్నాయి. విలాసవంతమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న డివిజన్లలో పందేలు రూ.10 లక్షల నుంచి మొదలవుతున్నాయి. మాస్‌ ఏరియాలు ఉన్న డివిజన్లలో రూ.లక్ష నుంచి ప్రారంభిస్తున్నారు. అజిత్‌సింగ్‌ నగర్‌, రాజీవ్‌ నగర్‌, వాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో పందేలు రూ.1-3 లక్షల మధ్య జరుగుతున్నాయి. గురునానక్‌ కాలనీ, మొగల్రాజపురం, అయోధ్యనగర్‌, సూర్యరావుపేట, లబ్బీపేట, సత్యనారాయణపురం వంటి ప్రాంతాల్లో పందేలు రూ.10 లక్షల నుంచి మొదలవుతున్నాయి. పందేలు మరింతగా పెరగవచ్చని బెట్టింగ్‌ బాబులు భావిస్తున్నారు. రాజకీయ, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు ఈ పందేలను పరుగులు తీయిస్తున్నాయి. ఎవరి చేతుల్లోకి నోట్ల కట్టలు వచ్చి పడతాయో, ఎవరి చేతుల్లో నుంచి జారిపోతాయో అన్నది మూడో తేదీన తేలిపోతుంది.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 03:45 AM