Share News

అవినాశ్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:38 AM

పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో నామినేషన్ల సందర్భంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ...

అవినాశ్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి

సింహాద్రిపురం, బంగారుపాళ్యం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో నామినేషన్ల సందర్భంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లకు శుక్రవారం ఆఖరు రోజు. వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించడానికి అవినాశ్‌రెడ్డి ఉదయం 9గంటల సమయంలో పులివెందుల నుంచి సింహాద్రిపురం బయలుదేరారు. వీరి కాన్వాయ్‌ను అంకాళమ్మగూడూరు వద్ద ఉన్నవారు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ కాన్వాయ్‌ను వెనక్కి తిప్పారు. ఆ సమయంలో కొంతమంది విసిరిన కర్రలు, రాళ్లు కాన్వాయ్‌లో చివరనున్న వాహనాలపై పడటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఎంపీ... డీఎస్పీని కలిశారు. నామినేషన్లు వేయడానికి తమవాళ్లకు రక్షణ కల్పించాలని కోరారు. సింహాద్రిపురం పోలీసులకు డీఎస్పీ ఫోన్‌ చేసి వైసీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలో...

బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె నామినేషన్‌ కేంద్రం సమీపంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణల్లో తెలుగు యువత మండల అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తల, ముఖం, చేతులకు బలమైన గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన మరో నలుగురితోపాటు నలగాంపల్లె వైసీపీ మద్దతుదారులు ఇద్దరికీ గాయాలయ్యాయి. ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలనూ చెదరగొట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 01:42 AM