Share News

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభ్యం

ABN , Publish Date - Aug 27 , 2026 | 05:47 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ 23 రోజుల తరువాత లభ్యమైంది.

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభ్యం

  • కోల్‌కతా సమీపంలో తీరానికి చేరినట్టు గుర్తింపు

  • స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు: మంత్రి అచ్చెన్న

అమరావతి/అమలాపురం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ 23 రోజుల తరువాత లభ్యమైంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా సమీపంలో ఏడుగురు మత్స్యకారులు బుధవారం మధ్యాహ్నం తీరానికి చేరుకున్నట్టు గుర్తించారు. వారిని త్వరగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్‌గార్డ్‌ యూనిట్లు, స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో బెంగాల్‌లోని శంకర్‌పూర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో బోటును గుర్తించి, మత్స్యకారులను రక్షించామని వెల్లడించారు. ఈ నెల 3న ఓడలరేవు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో సముద్రంలోకి వెళ్లారని, అయితే నిర్ణీతా సమయానికి బోటు తిరిగి రాకపోవడం, మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదన్న సమాచారంతో సీఎం చంద్రబాబు విస్తృత గాలింపునకు ఆదేశించారని చెప్పారు. విస్తృతంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్న సమయంలో.. మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందిందని వివరించారు. మత్స్యకారులు క్షేమంగా ఉండటం పట్ల అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు

Updated Date - Aug 27 , 2026 | 07:02 AM