మద్యం కుంభకోణంపై జగన్ సమాధానం చెప్పాలి: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:33 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో గొడ్డలి పార్టీ నేత జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ ద్వారా రూ.3200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని, తాడేపల్లిలోని జగన్ నివాసంలోనే దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారని మంత్రి తెలిపారు. వారికి అనుకూలంగా ఉన్నప్పుడు సత్యప్రసాద్ ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పుడు మద్యం కుంభకోణంలో వాస్తవాలు వెల్లడిస్తుండటంతో ఆయన మానసిక పరిస్థితిపై గొడ్డలి పార్టీ నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని విమర్శించారు.
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులను ఎందుకు పక్కన పెట్టారనే దానిపై అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయని, భారీ మొత్తంలో నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయనే దానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యం నిషేధం అన్న జగన్.. అధికారంలోకి రాగానే మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకుని వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి వేల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. మద్యం రవాణా కాంట్రాక్టులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కేంద్రీకరించడంలోనూ అవినీతి ప్రధాన పాత్ర పోషించిందన్నారు.
ఈ వార్తలనూ చదవండి..