Share News

రాయలసీమ ప్రాజెక్టుపై జగన్‌వి పచ్చి అబద్ధాలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:32 AM

రాయలసీమ ఎత్తిపోతలపై మాజీ సీఎం జగన్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమ ప్రాజెక్టుపై జగన్‌వి పచ్చి అబద్ధాలు

  • 2020లోనే ఎన్‌జీటీ స్టే ఇచ్చింది.. 2.65 కోట్ల జరిమానా వేసింది

  • వీటిపై కోర్టుకెందుకు వెళ్లలేదు?: నిమ్మల

అమరావతి/పాలకొల్లు (అర్బన్‌), నవంబరు27(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతలపై మాజీ సీఎం జగన్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ఎత్తిపోతల పథకంపై వాస్తవాలను ప్రజల ముందుంచే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. 2020లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఈ ప్రాజెక్టుపై స్టే విధించిందన్నారు. 2023లో రూ.2.65 కోట్ల జరిమానా కూడా విధించిందని గుర్తు చేశారు.

సీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తే తనకు మంచిపేరు వస్తుందనే.. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని కొనసాగించడం లేదంటూ జగన్‌ చేసిన ట్వీట్‌పై నిమ్మల స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020లో ఎస్‌జీటీ స్టే విధించినప్పుడు.. 2023లో రూ.2.65 కోట్ల జరిమానా విధించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ లేరా? తాగునీటి అవసరాల కోసమే రాయలసీమ ఎత్తిపోతల అంటూ జగన్‌ జీవో ఇవ్వలేదా?. ప్రాజెక్టును ఆపేసింది జగనే.


ఇప్పుడు రాయలసీమకు భవిష్యత్తుగా చెబుతున్నదీ ఆయనే.’’ అని నిమ్మల పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 27 నెలల్లోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రూ.13,484 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ‘‘సీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర మంత్రి ఎదుటే జగన్‌ను అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిలదీశారంటూ బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు ప్రకటనలు చేయడం ఏమిటి?. 2020లో ఈ ప్రాజెక్టుకు పరిపాలనా ఆమోదం ఇస్తూనే.. మరో వైపు ఎన్‌జీటీ ద్వారా స్టే తెప్పించిన ఘనుడు జగన్‌. ఈ స్టేని వ్యతిరేకిస్తూ కనీసం అఫిడవిట్‌ కూడా దాఖలు చేయలేదు. కేసీఆర్‌ను ఒప్పించి ప్రాజెక్టును ఎందుకు కొనసాగించ లేకపోయారు’’ అని నిమ్మల ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయలసీమ రైతాంగానికి సంప్రదాయంగా నిలిచే డ్రిప్‌ ఇరిగేషన్‌ను ఆపేసి రైతాంగానికి తీవ్ర ద్రోహం చేశారని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:35 AM