క్షేత్రస్థాయిలో పర్యవేక్షించండి
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:37 AM
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో నిమ్మల
అమరావతి నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని కాలువలు, డ్రైన్ల ద్వారా వెంటనే బయటకు పంపించేలా చర్యలు చేపట్టాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. మురసు తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ఆయన ఇరిగేషన్ ఉన్నతాధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, పలువురు సీఈలు, ఎస్‌ఈలు ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ‘మురసు తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పర్చూరు, బాపట్ల, చీరాల, ప్రత్తిపాడు ప్రాంతాల్లో నల్లమడ, పర్చూరు డ్రైన్లు గరిష్ఠ నీటిమట్టానికి మించి ప్రవహిస్తున్నాయి. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. బుడమేరు, ఎర్రకాలువ, గోనెలవాగు, తమ్మిలేరు, ఏలేరు నదులు, వాగులు, రిజర్వాయర్లకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగుల నుంచి ప్రకాశం బ్యారేజీకి 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. బుడమేరు క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి తరలిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ పటిష్ఠమైన ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేపట్టాలి. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా ఉండాలి.’ అని మంత్రి నిమ్మల ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్