Share News

సుపరిపాలన ఫలాలు.. ఈ ఫలితాలు: లోకేశ్‌

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:40 AM

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వ సుపరిపాలన ఫలాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ అన్నారు.

సుపరిపాలన ఫలాలు.. ఈ ఫలితాలు: లోకేశ్‌

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వ సుపరిపాలన ఫలాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈ విజయం కూటమి పార్టీల మధ్య సమన్వయం, సమష్టి కృషికి నిదర్శనమని చెప్పారు. ఈ ఘన విజయానికి కారకులైన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నగరమైనా, పట్టణమైనా, పల్లెలైనా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి జై కొడుతున్నారని, జనం పెట్టుకున్న నమ్మకాన్ని.. అప్పగించిన బాధ్యతను గెలుపు అహంకారం దరిచేరనీయకుండా మరింత పట్టుదలతో ప్రజాసేవకు పునరంకితమవుతూ నెరవేరుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


కూటమికి ఓటర్ల పట్టాభిషేకం: గద్దె

మున్సిపల్‌ ఎన్నికల తీర్చు లాగే పరిషత్‌ ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2.6 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటే... ‘ఇవి అసలు ఎన్నికలేనా?’ అంటూ జగన్‌ చులకనగా మాట్లాడటం బాధ్యతారాహిత్యం. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు, అపోహలు సృష్టించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ‘మా పార్టీ వారిని నామినేషన్లే వేయనివ్వడం లేదని జగన్‌ చేసిన ఆరోపణ పచ్చి అబద్ధం. టీడీపీవారితో పోటీగా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు’’ అని గద్దె స్పష్టం చేశారు.

సంక్షేమం, అభివృద్ధికే ప్రజల పట్టం: నసీర్‌ అహ్మద్‌

‘ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన రెఫరెండం వంటివి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం లేక జగన్‌ ఇంట్లో దాక్కున్నారు. కనీసం పులివెందులలో ఓటు కూడా వేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ ఎద్దేవా చేశారు.

లేళ్ల అప్పిరెడ్డిపై చర్యలు తీసుకుంటే తప్పేంటి: వర్ల

ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన లేళ్ల అప్పిరెడ్డిపై చర్యలు తీసుకుంటే తప్పేంటని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘బ్యాలెట్‌ బాక్సు ఎత్తుకెళ్లి, పోలింగ్‌ అధికారిని బంధించిన రౌడీషీటర్‌ లేళ్ల అప్పిరెడ్డిని అమాయకుడిగా జగన్‌ పేర్కొనడం సిగ్గుచేటు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులపై ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి’ అని వర్ల డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 04:43 AM