మంచి చేస్తున్నా..సీఎంను దూషిస్తారా?
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:21 AM
జగన్ అస్తవ్యస్తంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థను తాము చక్కదిదుతున్నప్పటికీ... ఉద్యోగులు ఆందోళనకు దిగడమేంటని ప్రభుత్వం ప్రశ్నించింది. మంచి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణగ్రామ,స్వర్ణవార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘స్వర్ణ’ ఉద్యోగులపై మంత్రి డోలా సీరియస్!
ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించం
అనుమతి లేకుండా ధర్నాలో పాల్గొన్నారు
విధి నిర్వహణలో సీఐ చనిపోతే.. చస్తే చావనీ అంటారా?
సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా?
ఒక వర్గాన్ని జగన్ రెచ్చగొడుతున్నారు
నాడు ప్రమోషన్ చానల్ సృష్టించలేదేం?
ఆచరణ సాధ్యమైనవన్నీ పరిష్కరిస్తాం: మంత్రి
ఏఏఎస్‌తో 1.14 లక్షల మందికి లబ్ధి
జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇవ్వడం కుదరదు
నోషనల్ ఇంక్రిమెంట్ల ఫైలు ఆర్థిక శాఖకు
పంపాం.. కార్యదర్శి భాస్కర్ స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జగన్ అస్తవ్యస్తంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థను తాము చక్కదిదుతున్నప్పటికీ... ఉద్యోగులు ఆందోళనకు దిగడమేంటని ప్రభుత్వం ప్రశ్నించింది. మంచి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణగ్రామ,స్వర్ణవార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వంపైన, ప్రభుత్వాధినేతలపైన ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆదివారం విజయవాడలో జరిగిన ధర్నాలో ఈ ఉద్యోగులు పాల్గొనడం ఎంత మాత్రం సరికాదన్నారు. ఆ ధర్నా సమయంలో విధుల్లో ఉన్న ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) హఠాన్మరణం చాలా బాధాకరమని తెలిపారు. అయితే కొందరు ఉద్యోగులు దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం చాలా దురదృష్టకరమన్నారు. వారి గ్రూపుల్లో పెట్టిన కామెంట్లను మంత్రి ఈ సందర్భంగా ప్రదర్శించారు.
‘విధుల్లో సీఐ చనిపోతే.. చస్తే చావనీ.. అంటూ మానవత్వం లేకుండా మాట్లాడడం సరికాదు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారు. ప్రజలు బుద్ధిచెప్పినా తీరు మార్చుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా వ్యవహరిస్తున్నారు. సీఐ మృతిపై ఆయన ఎందుకు మాట్లాడలేదు? కనీసం మానవత్వం లేదా? నాడు ఈ ఉద్యోగులకు ఎందుకు ప్రమోషన్ చానల్ సృష్టించలేదు? స్వర్ణగ్రామం/స్వర్ణవార్డు ఉద్యోగులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? డిమాండ్లను పరిష్కరిస్తున్నా.. ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’ అని స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ లేకుండా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే తాము సరిచేస్తున్నామని గుర్తుచేశారు. వీరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని.. గత ప్రభుత్వం నియమించింది కదా అని తాము వివక్ష చూపించడం లేదని చెప్పారు. జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు చేయాల్సిన మంచి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు సాధించాలనుకోవడం సరికాదన్నారు. ఆచరణ సాధ్యమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
14 వేల మందికి పదోన్నతులు ..
గత ప్రభుత్వం 1.23 లక్షల మందిని గ్రామ సచివాలయాల్లో పెద్దఎత్తున నియమించామంటూ గొప్పలు చెప్పుకొని.. వారి సర్వీసు రూల్స్ గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి.. అన్ని అంశాలూ చర్చించి వ్యవస్థను గాడిలో పెట్టామని గుర్తుచేశారు. ఇప్పటికే 14 వేల మందికి పదోన్నతులు కల్పించగా.. మున్సిపల్ శాఖ కూడా 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని చెప్పారు. రూ.150 కోట్లు అదనపు భారం పడుతున్నా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (ఏఏఎస్) వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదని, రెగ్యులరైజేషన్‌ను తామే అమలు చేశామని.. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైలును ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఉద్యోగులకు మేలు చేయాలన్న తపన తప్ప ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఒకే పోస్టులో ఆరేళ్లు పనిచేస్తే ఏఏఎస్: కార్యదర్శి
ఐటీ, స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. సుమారు 1.14 లక్షల మంది అర్హత కలిగిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(ఏఏఎస్) ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ‘ఒకే పోస్టులో ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 2న జీవో 7ను జారీచేశాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ క్యాడర్లకు మూడు వారాల్లోగా పదోన్నతి మార్గదర్శకాలు సిద్ధమవుతాయి. ఉద్యోగులు సెలవులు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆటోమేటిక్ క్యాజువల్ లీవ్ అప్రూవల్ ఫెసిలిటీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సెలవు దరఖాస్తుపై కాంపిటెంట్ అథారిటీ 24 గంటల్లోగా చర్యలు తీసుకోకుంటే.. ఆ క్యాజువల్ లీవ్ దరఖాస్తును స్వయంచాలకంగా ఆమోదించినట్లు పరిగణనలోకి తీసుకుంటాం. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి జిల్లాలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశాం. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం.
అత్యవసర సందర్భాల్లో తప్ప మిగతా సెలవు రోజుల్లో ఉద్యోగులకు విధులు కేటాయించవద్దని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డుల ఉద్యోగులకు కూడా మరణ ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 121 మందికి కారుణ్య నియామకాలు అమలు చేశాం’ అని వివరించారు. స్టయిపెండ్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరుచేయడానికి ప్రస్తుతం స్పష్టమైన నిబంధన లేనప్పటికీ.. తగిన ఉత్తర్వుల జారీకి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. స్వర్ణగ్రామ/స్వర్ణవార్డుల ఉద్యోగులను రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌తో సమానంగా నియమించినప్పటికీ.. ఏఏఎస్ మంజూరైన తర్వాత వారు జూనియర్ అసిస్టెంట్ స్కేలుకు చేరుకున్నందున జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
20 క్యాడర్ల ఉద్యోగులందరినీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి ఎలాంటి నిబంధనా లేదన్నారు. ఇది అన్ని శాఖలనూ ప్రభావితం చేస్తుందని, నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. అన్యాయమైన ఈ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఇతర శాఖల ఉద్యోగులందరూ తిరుగుబాటు చేసే అవకాశం ఉందని భాస్కర్ చెప్పారు. సమావేశంలో స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కూడా పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..