మైన్స్ ‘సేఫ్టీ’ గాలికి!
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:14 AM
ఒక ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అందుకు కారణాలను తెలుసుకుని, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మిడ్‌వెస్ట్ కంపెనీకి చెందిన గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమలో అలాంటి చర్యలేమీ కనిపించడం లేదు.
భద్రత పట్టించుకోని అధికారులు
‘మిడ్‌వెస్ట్’లో ప్రారంభం కాని శిథిలాల తొలగింపు
సర్వే చేసిన రెవెన్యూ అధికారులు
చీమకుర్తిలో మరికొన్ని క్వారీలలో పొంచి ఉన్న హైవాల్స్ ముప్పు
చీమకుర్తి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఒక ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అందుకు కారణాలను తెలుసుకుని, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మిడ్‌వెస్ట్ కంపెనీకి చెందిన గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమలో అలాంటి చర్యలేమీ కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఆర్‌ఎల్‌పురం పరిధిలోని మిడ్‌వెస్ట్ క్వారీలో గురువారం సాయంత్రం హైవాల్ దాదాపు 200 అడుగుల పైనుంచి క్వారీ పిట్‌లోకి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయినా మైన్స్ సేఫ్టీ అధికారుల్లో కనీస చలనం రాలేదు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోయినప్పటికీ భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే తరహా ప్రమాదాలు జరిగే అవకాశమున్న క్వారీలు మరో పది వరకూ ఇక్కడ ఉన్నాయి. అయినా సంబంధిత యంత్రాంగంలో కదలిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం గాంధీ జయంతి సెలవు దినం కావడంతో శిథిలాల తొలగింపు ప్రారంభం కాలేదు. వీటి తొలగింపునకు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
రెవెన్యూ నివేదిక తయారీ
మిడ్‌వెస్ట్ క్వారీలో హైవాల్ కుప్పకూలడానికి ప్రధాన కారణం ఏమిటన్న విషయంపై శుక్రవారం రెవెన్యూ అధికారులు పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. చీమకుర్తి తహశీల్దార్ బ్రహ్మయ్య, సర్వేయర్ మోజస్ సిబ్బందితో కలిసి మ్యాప్ సహాయంతో సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశారు. దానిని కలెక్టర్‌కు అందజేయనున్నారు. మరోవైపు మైన్స్ ఏడీ రామచంద్ర, ఆర్‌ఐ, సర్వేయర్లు కూడా వారి కోణంలో సర్వే చేశారు. పిట్ లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో బయటి నుంచే పరిశీలించారు.
అప్రమత్తతతో బయటపడ్డ కార్మికులు: మైన్స్ అధికారుల పరిశీలనలో కొత్తకోణం బయటపడినట్లు తెలుస్తోంది. మిడ్‌వెస్ట్ క్వారీతో బౌండరీని పంచుకుంటున్న ఏపీఎండీసీకి చెందిన జాయింట్ వెంచర్ క్వారీ నుంచి తొలుత హైవాల్ మట్టి జారింది. అది మిడ్‌వెస్ట్ హైవాల్‌పై పడటంతో, దాని నుంచి మట్టి, రాళ్లు ర్యాంపుపై పడి మొత్తం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న క్వారీ నుంచి మట్టి జారుతుండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై కాలినడకన మరోమార్గం నుంచి పైకి రావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు మైన్స్ అధికారులు నిర్ధారించుకున్నట్లు సమాచారం.
క్వారీ ఎదుట సీఐటీయూ ఆందోళన
మిడ్‌వెస్ట్ క్వారీ ఎదుట శుక్రవారం సీఐటీయూ నేతలు ఆందోళనకు దిగారు. యూనియన్ అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ.. క్వారీల్లో కార్మికుల ప్రాణాలకు భరోసా ఇచ్చే చర్యలను తీసుకోవాలని కోరారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు