Share News

బతుకులు బుగ్గి!

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:53 AM

అది... హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు! కింద సీట్లు, పైన బెర్తులూ! అరుణాచల్‌ప్రదేశ్‌లో ‘ఏఆర్‌ 20డీ 0487’ నంబరుతో రిజిస్టరైంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో బయలుదేరింది. తెల్లారేసరికి...

బతుకులు బుగ్గి!

  • మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం

  • టిప్పర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

  • 14 మంది సజీవ దహనం, 28 మందికి గాయాలు

(మార్కాపురం - ఆంధ్రజ్యోతి)

అది... హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు! కింద సీట్లు, పైన బెర్తులూ! అరుణాచల్‌ప్రదేశ్‌లో ‘ఏఆర్‌ 20డీ 0487’ నంబరుతో రిజిస్టరైంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో బయలుదేరింది. తెల్లారేసరికి... గమ్యస్థానం నెల్లూరు జిల్లా కలిగిరి చేరాలి. అందులో ఎక్కువమంది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. అందులోనూ అత్యధికులు తెలంగాణలో స్థిరపడిన భవననిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యులే! గురువారం ఉదయం 5.44 గంటల ప్రాంతంలో బస్సు మార్కాపురం దాటి... పొదిలివైపు వెళ్తోంది. జాతీయ రహదారి... ఎన్‌హెచ్‌ 565పై ప్రయాణం! మరో 3 గంటల్లో కలిగిరి చేరుతుంది. అప్పటికి బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌తో కలిపి మొత్తం 41 మంది ప్రయాణికులున్నారు. బస్సు... రాయవరం సమీపంలోని పలకల గనుల దగ్గర రోడ్డు డౌన్‌కు దిగుతోంది! అక్కడ మలుపు కూడా ఉంది. ఏమయిందో ఏమో... బస్సు డ్రైవర్‌ యువరాజ్‌ మలుపు దగ్గర అవసరమైనదానికంటే ఎక్కువగా కుడివైపునకు తిప్పాడు. అదే సమయంలో... ఎదురుగా చీమకుర్తి నుంచి మార్కాపురానికి కంకర లోడుతో టిప్పర్‌ వస్తోంది. తనకు ‘అప్‌’ కావడంతో టిప్పర్‌ నెమ్మదిగానే కదులుతోంది. బస్సు వేగంగా తనవైపు రావడం చూసి టిప్పర్‌ డ్రైవర్‌ కంగారు పడ్డాడు. అది ఇటువైపు వస్తోందంటూ తను స్టీరింగ్‌ను కుడివైపునకు కోశాడు. అంతే... హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు సరిగ్గా టిప్పర్‌ మధ్యలో ఉన్న డీజిల్‌ ట్యాంకర్‌ దగ్గర ఢీకొట్టింది. ఆ వేగానికి డీజిల్‌ ట్యాంకర్‌ బద్దలైంది. టిప్పర్‌ తిరగబడింది. మంటలు రాజుకుని క్షణాల్లోనే అటు టిప్పర్‌, ఇటు బస్సు... రెండింటికీ అంటుకున్నాయి. సీట్‌ కుషన్ల కారణంగా బస్సులో శరవేగంగా మంటలు వ్యాపించాయి.

3.jpg


4.jpg

అద్దాలు బద్దలు కొట్టుకుని...

ఒక్కసారిగా పెద్ద శబ్దం, మంటలు, పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బెర్తులలో ఉన్నవారు తమ పక్కనే ఉన్న అద్దాలు బద్దలుకొట్టి కిందకు దూకారు. బస్సు వెనుకవైపు అద్దాలు పగలగొట్టి మరికొందరు బయటపడ్డారు. అప్పటికప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించి ‘ఎమర్జెన్సీ ఎగ్జిట్‌’ ద్వారా మరికొందరు కిందికి దిగారు. కిందికి వచ్చిన వారిలో కొందరు ప్రాణాలకు తెగించి మరికొందరిని కాపాడేందుకు సహాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది.

గుర్తుపట్టలేనంతగా...

బస్సులో నుంచి బయటపడలేని అసహాయ స్థితిలో 14 మంది సజీవ దహనమయ్యారు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన వారి దేహాలు నల్లటి మాంసపు ముద్దలుగా, గుర్తించడానికి వీలు లేకుండా మారాయి. ఆ మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు వైద్యశాల వద్దకు తరలివచ్చారు. ఆనవాళ్లు కూడా లేకుండా మిగిలిన మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టారు. డీఎన్‌ఏ నివేదిక వచ్చిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామని... అందుకు మరోరోజు సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.

5.jpg


కాలిన గాయాలూ.. విరిగిన ఎముకలు

ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో బస్సు నుంచి కిందికి దూకడంతో పలువురికి కాళ్లు విరిగాయి. కొందరికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మొత్తంగా 28మంది గాయపడగా... వారిని మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. 15 మందిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. బస్సులో వెనుక లగేజ్‌ స్పేస్‌లో కొన్ని మినీ గ్యాస్‌ సిలిండర్లు కనిపించాయి. ప్రమాద తీవ్రతకు అవే కారణమని తొలుత భావించినా... అవి ఖాళీవని పోలీసులు నిర్ధారించారు.

6.jpg

కుమార్తెతో గడపాలని..

కనిగిరి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బండారు పద్మ(26), భర్త వెంకట్రామయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెను కనిగిరిలో అమ్మమ్మ వద్ద ఉంచి భర్త,కుమారుడితో కలసి తెలంగాణ జిల్లా నిర్మల్‌లో కూలి పనుల కోసం వెళ్లింది. శ్రీరామనవమి సందర్భంగా కుమార్తెతో గడపాలని కనిగిరికి ఆమె ఒక్కరే బయలుదేరింది. ప్రమాదంలో సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న అమ్మమ్మ గుండెలవిసేలా రోదించింది.

7.jpg

తల్లీకుమార్తె మృతి

కొండాపురం మండలం తూర్పుయర్రబల్లి గ్రామానికి చెందిన నర్పింగు శ్రీను, ప్రభావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వారి వృత్తి బేల్దారి పని. బుధవారం సాయంత్రం జగిత్యాల నుంచి ప్రభావతి కుమార్తె చైత్రితో కలసి ప్రకాశం జిల్లా పొదిలి మండలం గురవాయపాలెంలో తన పుట్టినింటికి బయలుదేరింది. కొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకునేలోగా బస్సు ప్రమాదంలో ప్రభావతి (38), చైత్రి (5) ఇద్దరూ మృత్యువాతపడ్డారు.


వీధినపడ్డ కుటుంబం

కలిగిరి మండలం నాగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఆత్మకూరు చిన్నయ్య (43) నిర్మల్‌లో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శ్రీరామనవమి పండగకు వస్తూ బస్సు ప్రమాదంలో మరణించాడు. మృతుడికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. చిన్నపాటి రేకులషెడ్‌లో నివసిస్తున్న ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో రోడ్డునపడ్డారు.

ఆగుతూ... సాగుతూ!

హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు ప్రతి రోజూ జగిత్యాలలో బయలుదేరి నిర్మల్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ మీదుగా కలిగిరికి నడుస్తుంది. బుధవారం సాయంత్రం జగిత్యాలలో కదిలినప్పటి నుంచే బస్సు మొరాయిస్తోందని ప్రయాణికులు తెలిపారు. బయలుదేరే సమయంలోనే సమస్య తలెత్తినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. తర్వాత ఆర్మూర్‌ వద్ద బస్సు నిలిచిపోవడంతో... అందరినీ మరో బస్సులోకి మార్చారని, కొద్దిసేపటికి మళ్లీ పాత బస్సునే తెచ్చారని మౌనిక అనే ప్రయాణికురాలు తెలిపారు. బయలుదేరిన తర్వాత బస్సు పలుమార్లు ఆగిందని చెప్పారు. ‘బస్సులో ప్రాబ్లం ఉంది’ అని డ్రైవర్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు... బస్సు స్టీరింగ్‌ స్ట్రక్‌ అయ్యిందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఘటన స్థలానికి మంత్రులు

గురువారం క్యాబినెట్‌ సమావేశం ఉన్నప్పటికీ... ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడ నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాలలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, రవాణాశాఖ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా, ఇంటెలిజెన్స్‌ ఐజీ రామకృష్ణ. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ కృష్ణారావు తదితర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


9.jpg

డ్రైవర్లు ఎక్కడ...

ప్రమాదం తర్వాత టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. సెల్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్‌ చేసిన యువరాజు, క్లీనర్‌ మహేంద్ర రెడ్డి... గాయాలతో బయటపడ్డారు. మరో డ్రైవర్‌ ఆచూకీ తెలియడంలేదు.

1.అంబటి అనిల్‌(27), పెద్దారికట్ల, కొనకనమిట్ల మండలం, మార్కాపురం జిల్లా

2.అంబటి లియోన్‌(5 నెలలు), (అనిల్‌ కుమారుడు)

3.ఉప్పు రమాదేవి(45), లింగారెడ్డిపల్లి, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా

4.దేవెండ్ల రామయ్య(50), పునుగోడు, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా

5.బండారు పద్మ(28), కనిగిరి, మార్కాపురం జిల్లా

6.టి.పిచ్చమ్మ(80), చల్లగిరిగల, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా

7.టి.రుక్మిణి(26), చల్లగిరిగల, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా

8.పొదిలి మహేంద్ర(28), చౌడవరం, వెలిగండ్ల మండలం, మార్కాపురం జిల్లా

9.నర్సింగ్‌ ప్రభావతి(36), తూర్పుయర్రబల్లి, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా

10.నర్సింగ్‌ చైత్రి(6), తూర్పుయర్రబల్లి, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా

11.ఆత్మకూరు చిన్నయ్య(45), బొమ్మరాజుచెరువు, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా

12.ఎం.వెంకటేశ్వర్లు(45), దాసరిపల్లి, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా

13.కత్తి జయరాములు(55), బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా

14.గుండ్లపల్లి వెంకటేశ్వర్లు(26), నాయుడుపల్లి, దుత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా

Updated Date - Mar 27 , 2026 | 05:53 AM