Share News

అమ్మో.. బుచ్చంపేట ఏడో వార్డు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:10 AM

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చంపేట గ్రామపంచాయతీ ఏడో వార్డు అంటే అందరూ తెగ భయపడిపోతున్నారు.

అమ్మో.. బుచ్చంపేట ఏడో వార్డు!

  • అక్కడ నామినేషన్‌ వేస్తే చనిపోతారని భయం

  • 25 ఏళ్ల తర్వాత పడిన ఒకే ఒక్క నామినేషన్‌

కోరుకొండ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చంపేట గ్రామపంచాయతీ ఏడో వార్డు అంటే అందరూ తెగ భయపడిపోతున్నారు. ఆ వార్డుకు నామినేషన్‌ వేస్తే చనిపోతారనే భయాందోళన స్థానికులను గత 25 ఏళ్లుగా వెంటాడుతోంది. గత ఐదు పంచాయతీ ఎన్నికల నుంచి ఈ వార్డుకు ఎవరు నామినేషన్‌ వేయడం లేదు.

ఫలితంగా ఆ వార్డు అలాగే ఖాళీగా ఉండిపోతుంది. ఉప ఎన్నిక నిర్వహించినా ఎవరూ నామినేషన్‌ వేయరు. ఇందుకు కారణం 25 ఏళ్లకు ముందు ఆ వార్డు నుంచి గెలుపొందిన అభ్యర్థులు వివిధ కారణాలతో పదవీకాలం పూర్తికాకుండానే మరణించడం, ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన వార్డు సభ్యుడు కూడా మధ్యలోనే చనిపోవడం! దీనిపై అధికారులు అవగాహన కల్పించినా ఫలితం లేదు.

అయితే ఈ సారి గ్రామానికి చెందిన కోసూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి నామినేషన్‌ వేయడం గమనార్హం. ఇంకెవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు! సుబ్రహ్మణ్యంకు ఉప సర్పంచ్‌గా అవకాశం ఇస్తామని ఓ వర్గం పంచాయతీ అభ్యర్థి ప్రకటించారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రాణానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. అయితే తన కుటుంబసభ్యులు మాత్రం దీనిపై భయపడుతున్నారని పేర్కొన్నారు. బుచ్చంపేటలో 29న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 01:13 AM