సింహ వాహనంపై గోవిందుడి దర్శనం
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:42 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం ఉదయం మలయప్ప స్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి, యోగనరసింహుడిగా శక్తికి ప్రతీకైన సింహ వాహనాన్ని అధిరోహించి, మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
రాత్రి ముత్యపుపందిరిలో కటాక్షించిన మలయప్ప
తిరుమల, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం ఉదయం మలయప్ప స్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి, యోగనరసింహుడిగా శక్తికి ప్రతీకైన సింహ వాహనాన్ని అధిరోహించి, మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తబృందాలు భజనలు, కోలాటాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. జీయ్యంగార్లు ఘోష్టితో స్వామిని కీర్తించారు. మంగళవాయిద్యాల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంలో కొలువుదీరిన మలయప్పస్వామి తిరువీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల తొలి రెండు రోజులూ తిరుమలలో రద్దీ కొంత తక్కువగా కనిపించినప్పటికీ గురువారం భక్తుల సంఖ్య పెరిగింది.
బ్రహ్మోత్సవాల్లో నేడు:
ఉదయం: కల్పవృక్షవాహనం,
రాత్రి: సర్వభూపాల వాహనం