మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:39 AM
కృష్ణాజిల్లా మచిలీపట్నం ఈడేపల్లిలోని బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్యాస్ లీకేజీతో సిలిండర్ ఒక్కసారిగా సమీపంలో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
కృష్ణాజిల్లా, ఆగస్టు 12: మచిలీపట్నం ఈడేపల్లిలోని బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ల లీకేజీ పేలుడుకు దారితీసింది. బెల్ కంపెనీ వెనుక రోడ్డులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయి సమీపంలోని ఇళ్లు, వాహనాలు, అక్కడున్న వ్యక్తుల వైపు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, సిబ్బంది హుటాహుటిన ఆంధ్ర హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఓ ఇంటి గోడలు బద్దలవ్వగా, సమీపంలో ఉన్న కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
జనావాసాల మధ్య ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ ఉంచడంతో పాటు అద్దెకు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య ఇలాంటి సిలిండర్ల నిర్వహణ వల్ల ఎప్పుడైనా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్లను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జిల్లా ఫైర్ ఆఫీసర్ యేసురత్నం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు, సిలిండర్ల నిర్వహణలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై విచారణ చేపడతామని తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్