కృష్ణా జిల్లాలో దారుణ హత్య.. ఒకచోట మొండెం, మరోచోట కాళ్లు, చేతులు
ABN , Publish Date - Oct 21 , 2026 | 06:52 PM
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ హత్య వెలుగుచూసింది. బందరు మండలం వాడపాలెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు.. మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా నరికి, మొండాన్ని ఒకచోట, కాళ్లు, చేతులను మరోచోట పడేశారు.
కృష్ణా, అక్టోబర్ 21: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. బందరు మండలం వాడపాలెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా నరికినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మృతదేహంలోని మొండాన్ని ఒకచోట, కాళ్లు, చేతులను మరోచోట పడేసినట్లు సమాచారం. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. మృతుడు ఎవరు? అతడిని ఎవరు హత్య చేశారు? వ్యక్తిగత కక్షల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో చర్చ జరుగుతోంది. అయితే మృతుడి గుర్తింపు.. హత్యకు దారితీసిన పరిస్థితులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బందరు రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఆర్.పేట సీఐ ఏసుబాబు స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఈ హత్య ఘటనను జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు హత్యకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు.. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు.. ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మృతుడి గుర్తింపు లభిస్తే కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించే అవకాశం ఉంది. ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..