Share News

కరుణించిన వరుణుడు

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:08 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా రైతాంగానికి ఊపిరినిచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి.

కరుణించిన వరుణుడు

  • కోస్తాలో పంటలకు ఊపిరినిచ్చిన అల్పపీడనం.. రెండు రోజులుగా ఎక్కువచోట్ల వర్షాలు

  • పెనుగొండ, ఇరగవరం,పెనుమంట్రల్లో 10 సెం.మీ.పైనే

  • నేడూ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా రైతాంగానికి ఊపిరినిచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం శనివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలిసారిగా రెండు రోజులపాటు ముసురు వాతావరణం నెలకొంది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సమీపానికి రావడంతో శ్రీకాకుళం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు వర్షాలు పెరిగాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాలు ఖరీఫ్‌ పంటలకు తాత్కాలికంగా ప్రాణం పోశాయని రైతులు చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అత్యధికంగా 10.8 సెం.మీ., ఇరగవరంలో 10.7, పెనుమంట్రలో 10.4, ఆచంటలో 9.76, గణపవరంలో 9.74, కోనసీమ జిల్లా మలికిపురంలో 7.97, శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 7.38, కవిటిలో 6.34, విజయవాడ రూర ల్‌లో 6.14, కోనసీమ జిల్లా పి.గన్నవరంలో 6, కృష్ణా జిల్లా నందమూరులో 3.85, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో 3.7, పోలవరం జిల్లా కూనవరంలో 3.25, కోనసీమ జిల్లా అయినవిల్లిలో 3.07 సెం.మీ. వాన పడింది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరుగా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మన్యం, పోలవరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి రానున్న రెండు రోజుల్లో అరేబియా సముద్రంలోకి ప్రవేశించి, తర్వాత ఈశాన్యంగా దిశ మార్చుకుని రాజస్థాన్‌ వైపు వెళ్లనుందని వాతావరణ శాఖ అంచనావేసింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 03:08 AM