Share News

ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:03 AM

డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు... ఆర్థిక సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని...

ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్‌

  • బడ్జెట్‌ అంచనాలు, వాస్తవ చెల్లింపులకు మధ్య తేడా ఉంటుందని తెలియదా: లోకేశ్‌

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు... ఆర్థిక సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బుధవారం మరోసారి ఆయన ఎక్స్‌ ద్వారా స్పందించారు.

దీనిపై జగన్‌ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రతిస్పందనగా ఈ పోస్టు చేశారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఏ త్రైమాసికంలో విడుదల చేశామన్నది వేరు. ఆ నిధులు ఏ విద్యా సంవత్సరపు బకాయిలకు చెల్లించామన్నది వేరు. ఇది కూడా తెలియని జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2024-25 బకాయిల కోసం సుమారు రూ.3 వేల కోట్లు విడుదల చేశామని అసెంబ్లీలో చెప్పాం.

ఆ మాటకే కట్టుబడి ఉన్నాం. ఏ త్రైమాసికంలో ఎంత మొత్తం విడుదల చేశామో పూర్తి వివరాలను స్పష్టంగా చూపిస్తున్నాం. బడ్జెట్‌ అంచనాలు, సవరించిన కేటాయింపులు, వాస్తవ చెల్లింపులకు మధ్య తేడా ఉంటుంది. నిధుల విడుదలకు అనుగుణంగా బడ్జెట్‌లో సర్దుబాట్లు జరుగుతుంటాయి.


ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు ఈ విషయాలు తెలియకపోవడం, తెలుసుకోలేకపోవడం విచారకరం. మీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఎప్పుడూ ఆలస్యంగానే విడుదలయ్యేవి. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలోపే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి వచ్చేది.

మేమా పరిస్థితి మార్చాం. విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా నేరుగా కాలేజీలకే నిధులు చెల్లించే విధానం తీసుకొచ్చాం. ప్రతినెలా రూ.200-.300 కోట్లు చొప్పున క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం ఇకపై ఆపండి’ అని హితవు పలికారు. కాగా కూటమి ప్రభుత్వం... 2023-24 వరకు ఉన్న ఫీజులు రూ.193 కోట్లు, 2024-25 ఫీజులు రూ.3,060 కోట్లు, 2025-26 ఫీజులు రూ.1,709 కోట్లు చెల్లించినట్లు వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 06:10 AM