Share News

మా నాన్నతో పోటీ పడలేం

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:45 AM

మాకు గల్లీ రాజకీయాలంటేనే ఇష్టం. ఢిల్లీ రాజకీయాలు మాకొద్దు’ అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళతారు..

మా నాన్నతో పోటీ పడలేం

  • సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేశ్‌ స్పష్టీకరణ

  • ‘కల్తీ’ బాధ్యులను వదిలిపెట్టబోం

  • ముంబైలో ఆంగ్ల చానల్‌ చర్చా వేదికలో

  • మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యలు

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘మాకు గల్లీ రాజకీయాలంటేనే ఇష్టం. ఢిల్లీ రాజకీయాలు మాకొద్దు’ అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళతారు.. లోకేశ్‌ సీఎం అవుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ఇలా స్పందించారు. ‘ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఓ ఆంగ్ల చానల్‌ ముంబైలో నిర్వహించిన చర్చలో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీనిపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు 75 ఏళ్ల యువకుడని, ఇప్పట్లో ఆయనతో పోటీ పడలేమని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా క్వాంటమ్‌ వ్యాలీపై ఆలోచన చేయని సమయంలోనే చంద్రబాబు దానిపై మంత్రివర్గ సహచరులతో తన ఆలోచనను పంచుకున్నారు. స్టాన్‌ఫోర్డులో చదివిన నేనే క్వాంటం వ్యాలీపై సమాచారం ఇవ్వాలని చాట్‌జీపీటీలో కోరాల్సి వచ్చింది. చంద్రబాబు ఆలోచనలు ఎంత ముందు చూపుతో.. ఎంత యంగ్‌గా ఉంటాయో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’’ అని వివరించారు. చంద్రబాబుతో పనిచేయడం తేలిక కాదని, మనం 50 కేజీలు బరువు మోస్తుంటే ఆయన మరో 10 కేజీలు మోయాలని టాస్క్‌ పెడతారని లోకేశ్‌ వివరించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను జీవితాంతంపెద్దన్నగానే చూస్తానని లోకేశ్‌ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

90 రోజుల్లో సోషల్‌ మీడియా చట్టం

‘‘సామాజిక మాధ్యమాలకు పిల్లలను దూరంగా ఉంచాలనే ఆలోచన నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాల్లో ఉండకూడదని నేను బలంగా విశ్వసిస్తాను. అదే సమయంలో కొన్ని రకాల కంటెంట్‌ను 16 ఏళ్లలోపు వారికి దూరంగా ఉంచాలి. మూడు నెలల్లో దీనిపై సోషల్‌ మీడియా చట్టాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం..’’


క్షమాపణలు చెబుతున్నా..

‘‘తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం అనేది జగన్‌ హయాంలో జరిగినా... రాజకీయాలకు అతీతంగా ప్రపంచంలోని హిందువులందరికీ నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. ప్రసాదాన్ని కల్తీ చేసిన బాధ్యులపై మేం కఠిన చర్యలు తీసుకుంటాం. సిట్‌ నివేదిక ప్రకారం, టీటీడీ మాజీ చైర్మన్‌ సహా ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. తిరుమలలో వరల్డ్‌ క్లాస్‌ టెస్టింట్‌ ఫెసిలిటీ నిర్మిస్తున్నాం.’’

ఐదేళ్ల వేధింపులకు సమాధానమే రెడ్‌బుక్‌

‘‘గత ఐదేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వారిని ఆనాడు అవమానాలు, వేధింపులకు గురిచేసినవాళ్లకు సమాధానమే రెడ్‌ బుక్‌. చట్ట ఉల్లంఘన చేసినవాళ్లు, అందుకు ప్రేరేపించిన రాజకీయ నాయకులు, వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లు ఆ బుక్‌లో ఉంటాయి. రాజకీయ పార్టీగా టీడీపీ ప్రాంతీయ పార్టీయే. కానీ, దేశ ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది మా విధానం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.గత ఎన్నికల్లో ఎక్కడా ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇవ్వలేదు. ఏపీకి అత్యధిక నిధుల సాధనే మాలక్ష్యం.’’ అని లోకేశ్‌ అన్నారు.

రెడ్‌బుక్‌లో జగన్‌ పేరు ఉందా?

  • ఉందో లేదో త్వరలో తెలుస్తుంది

  • ‘ఆంగ్ల చానల్‌’ ప్రశ్న..లోకేశ్‌ జవాబు

ఆంగ్ల చానల్‌ : రెడ్‌బుక్‌ నిండా జగన్‌.. జగన్‌.. అని రాసుకున్నారా?

లోకేశ్‌ : రెడ్‌బుక్‌లో జగన్‌ పేరు ఉందో లేదో త్వరలోఅందరికీ తెలుస్తుంది.

ఆంగ్ల చానల్‌ : తిరుమల లడ్డూ విషయాన్ని మాట్లాడుతూనే, కోవా బన్ను వ్యాపారం చేసే ముస్లింకు అండగా ఉండటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

లోకేశ్‌ : నేను హిందువునైనా అన్ని మతాలనూ గౌరవిస్తాను. కోవా బన్ను వ్యాపారిని మతం పేరుతో అవమానించడం బాధించింది. అతనికి అండగా ఉండటం బాధ్యతగా భావించా.


ఆంగ్ల చానల్‌ : చంద్రబాబుకు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్న గుర్తింపు ఉంది. ఇప్పుడు ఏపీలో మళ్లీ కొత్తగా హైదరాబాద్‌ లాంటి నగరాన్ని అభివృద్ధి చేయడంలో ఒత్తిడి ఏమైనా ఎదుర్కొంటున్నారా?

లోకేశ్‌ : ఎలాంటి ఒత్తిడీ ఎదుర్కోవడం లేదు. దీన్ని సవాల్‌గా పరిగణిస్తున్నాం. ఏపీలో మేం ఒక నగరాన్నే కాదు, మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగమే..విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థికమండళ్ల అభివృద్ధి. అమరావతి.. అద్భుతమైన భవిష్యత్తు నగరం. అమరావతి పడవను మిస్‌ అయితే భవిష్యత్తులో బాధపడతారు.

ఆంగ్ల చానల్‌ : రాష్ట్రం అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు ఎందుకు పందేరం చేస్తున్నారు?

లోకేశ్‌ : ప్రభుత్వ భూములను ఎవరికీ విక్రయించేయడం లేదన్న విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. భూములు ఇవ్వడం ద్వారా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాం. భవిష్యత్తులో వాటి ద్వారా సమకూరే ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్రాభివృద్ధికి ఎంతో దోహదపడుతాయి. కాగ్నిజెంట్‌ సంస్థకు భూమి కేటాయించడం ద్వారా 25 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేశాం. ఏడాదికి రూ.1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు విశాఖను వేదికగా చేశాం. రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సయే. ఎన్డీయే కూటమి ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే, ఏపీలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ సర్కార్‌ ఉంది.

2.jpg

సంజయ్‌దత్‌తో లోకేశ్‌ భేటీ

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ను కలవడం ఆనందంగా ఉందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల చానల్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబైకి వెళ్లిన లోకేశ్‌ అక్కడ సంజయ్‌దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో సినిమా షూటింగ్‌లకు సింగిల్‌ విండోలో అనుమతులు ఇవ్వడం, ఫిల్మ్‌ సిటీ నిర్మాణం వంటి అంశాలపై చర్చించినట్లు లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 06:10 AM