డీఎస్సీపై చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:38 AM
‘డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా!? ప్లేస్ నువ్వు చెబుతావా! నన్ను చెప్పమంటావా!?’ అని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేశ్ మరోసారి సవాల్ విసిరారు. ఆయనకు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఆయనలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం రాష్ట్రానికే అవమానమన్నారు. ‘జగన్ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు.
ప్లేస్ నువ్వు చెబుతావా.. నన్ను చెప్పమంటావా?
జగన్‌కు మరోసారి లోకేశ్ సవాల్
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఆయనకు తేడా తెలియదు
డీఎస్సీపై పేటెంట్ హక్కులు టీడీపీవే
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారిని వదిలిపెట్టం: లోకేశ్
కోవూరు టీడీపీ శ్రేణులతో భేటీ
కోవూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా!? ప్లేస్ నువ్వు చెబుతావా! నన్ను చెప్పమంటావా!?’ అని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేశ్ మరోసారి సవాల్ విసిరారు. ఆయనకు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఆయనలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం రాష్ట్రానికే అవమానమన్నారు. ‘జగన్ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాదు. ఆయన నేర చరిత్ర వారికి తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మరు’ అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోవూరులో జరిగిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీపై జగన్ అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ అమ్ముకోవడమని జగన్ అనుకున్నాడని, అందుకే ఐదేళ్ల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా రాష్ట్రమంతా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అయ్యేలా పాలన సాగించాడని ధ్వజమెత్తారు. ‘డీఎస్సీపై పేటెంట్ హక్కులు టీడీపీకి మాత్రమే ఉన్నాయి. గత తెలుగుదేశం పాలనలో పలుసార్లు డీఎస్సీ నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. తన ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వని జగన్.. మాపై నిందలు వేయడం హాస్యాస్పదం’ అని అన్నారు.
వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వదలం
మహిళల గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సహించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై కొంతమంది రౌడీలు అసభ్యంగా మాట్లాడుతున్నారని, అలాంటివారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
బాబు జోలికి రావొద్దు..
ప్రతి నిమిషం ప్రజల కోసమే ఆలోచించే, శ్రమించే చంద్రబాబు గురించి మాట్లాడితే ప్రజలు హర్షించరని, ఆయన జోలికి వస్తే మాడి మసైపోతారని లోకేశ్ అన్నారు. సొంత బాబాయిని సైతం ఈ సైకో లేపేశాడని, దానిని నారాసుర రక్త చరిత్ర పేరుతో తమపై బురదజల్లడానికి ప్రయత్నించారని లోకేశ్ విమర్శించారు. గులకరాయి దెబ్బ తగిలిందని ఒకరోజు, ప్లాస్టర్ వేసుకుని మరొక రోజు సింపతీ కోసం తాపత్రయపడ్డారని ఎద్దేవా చేశారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఓ నాయకుడు ప్రగల్భాలు పలికాడని, ఏమైందని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
కార్యకర్తే అధినేత
టీడీపీలో కార్యకర్తే అధినేత అని, వారినలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని లోకేశ్ స్పష్టంచేశారు. ‘నా తెలుగుదేశం, నా బాధ్యత’ అనే కార్యక్రమం ద్వారా పార్టీలోకి యువరక్తాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలిచి టీడీపీకి కానుకగా ఇస్తామన్నారు. ఇటీవల రెండ్రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో లోకేశ్ చేసిన మార్గనిర్దేశంతో మరింత ఉత్తేజంతో పనిచేస్తున్నామని, అసత్య ప్రచారాలను ఎండగడుతున్నామని ఎంపీ వేమిరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాగా.. కోవూరులో లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన్ను చూడడానికి, కరచాలనానికి పోటీలు పడ్డారు.
ప్రభుత్వ బడులు ప్రైవేటుతో పోటీ పడాలి: లోకేశ్
నెల్లూరులో ఆర్‌ఎస్ఆర్, డీఎస్సార్ పాఠశాలలు ప్రారంభం
విద్యాబోధన, పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడాలని మంత్రి లోకేశ్ పిలుపిచ్చారు. నెల్లూరులో పీ-4 పథకం కింద అభివృద్ధి చేసిన రెండు మున్సిపల్ హైస్కూళ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. స్టోన్‌హౌ్‌సపేటలో ఆర్‌ఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూలును ఎంపీ వేమిరెడ్డికి చెందిన వీపీఆర్ ఫౌండేషన్ సంస్థ రూ.8.3 కోట్లతో.. దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో మూలపేటలోని డీఎ్‌సఆర్ పాఠశాలను రూ.13.14 కోట్లతో ఆధునికీకరించారు. నగరంలో మరో 14 స్కూళ్లను పీ4 కింద అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం 10.30కు నెల్లూరు చేరుకున్న లోకేశ్‌కు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనంగా స్వాగతించారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య