సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:53 AM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సూచించారు.
ఆదోని, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మోహన్, కెనరా బ్యాంక్ ఓల్డ్ టౌన్ శాఖ చీఫ్ మేనేజర్ రాజేష్ రాజమోహన్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్థసారథి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మోహన్ వేర్వేరుగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెనుకబడిన ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఆదోని పరిసర ప్రాంతాలకు పరిశ్రమలు వస్తే ఐదు నియోజకవర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకర్లకు టార్గెట్లు ఉన్నప్పటికీ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గత ఏడాది కేవలం 268 మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలు అందాయని, ఈ దఫా సీసీఆర్‌సీ కార్డులు కలిగిన 25 వేల మంది కౌలు రైతులకు మొత్తంగా రూ.2 లక్షల ప్రకారంగా రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పలు బ్యాంకుల మేనేజర్లు స్వయంగా హాజరుకాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపి ’మమ’ అనిపించడంపై ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ
కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బి. తాండ్రపాడులోని కేంద్రంలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సీబీఆర్‌సెటీ డైరెక్టర్ పుష్పకుమార్ తెలిపారు. పదో తరగతి చదివిన గ్రామీణ యువతకు సెల్‌ఫోన్ రిపేరింగ్, వైరింగ్, శానిటేషన్, పంపుసెట్ల రిపేరు, సీసీ కెమెరాల సర్వీసింగ్, అలాగే మహిళలకు టైలరింగ్, డిజైనింగ్, అగర్‌బత్తీల తయారీ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి బ్యాంకర్ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ బ్యాంకు అధికారి రాజేష్, రాజమోహన్, ఉషాకుమార్, బ్యాంకు లింకేజీ ఏపీఎం కరుణాకర్, ఎంపీడీఓ నాగరాజుస్వామి, ఆదోని నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, అగ్రికల్చర్, డీఆర్‌డీఏ, ఎంఈపీఎంఏ శాఖల అధికారులు, స్వయం ఉపాధి ఆశావహులు పాల్గొన్నారు.