కుమారుడికి భారం కాకూడదని..
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:56 PM
వయోభారం.. అనారోగ్యంతో కుమారుడికి భారం కాకూడదనుకొని ఓ వృద్ధ దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉరేసుకొని వృద్ధ దంపతుల బలవన్మరణం
నంద్యాల సంజీవనగర్‌లో ఘటన
నంద్యాల క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వయోభారం.. అనారోగ్యంతో కుమారుడికి భారం కాకూడదనుకొని ఓ వృద్ధ దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలోని సంజీవనగర్‌లో చోటుచేసుకున్నట్లు రెండో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ అస్రార్‌బాషా, ఎస్‌ఐ సురేష్ తెలిపారు. వివరాలు.. సంజీవనగర్‌లోని కోదండ రామా లయం సమీపంలో అంకిరెడ్డి, అనురాధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కిరణ్ కుమార్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అంకిరెడ్డి(65) పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుమె న్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కుమారుడైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా జీవితంలో స్థిరపడలేదు. దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కుమారుడికి భారం కాకూడదని ఆలోచించి మంగళవారం కూరగాయలకు వెళ్లిన కుమారుడి వాట్సప్‌కు మెసేజ్ పెట్టారు. దంపతులిద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెసేజ్ చూసుకున్న కుమారుడు ఇంటి వచ్చేలోగా తల్లిదండ్రులు ఇరువురు విగత జీవులుగా ఉండటాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఏఎస్పీ సుస్మిత రామనాథన్, రెండో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ అస్రార్‌బాషా, ఎస్‌ఐ సురేష్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.