ఆసుపత్రిలో అపరిశుభ్రత

ABN, Publish Date - Jul 03 , 2026 | 12:31 AM

ఎమ్మిగనూరు ప్రాంతవాసులకు వైద్యసౌకర్యాలు అందించే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అపరిశుభ్రత నెలకొని విష సర్పాలకు కేంద్రంగా మారింది.

సంచరిస్తున్న విష సర్పాలు, ఆందోళనలో రోగులు

ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు

ఎమ్మిగనూరు టౌన్‌, జూలై2 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు ప్రాంతవాసులకు వైద్యసౌకర్యాలు అందించే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అపరిశుభ్రత నెలకొని విష సర్పాలకు కేంద్రంగా మారింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు కలపి ఎమ్మిగనూరులో ఒక్క సి.బెళగల్‌ మండలంలోని ఆయా గ్రామాల నుంచి రోజూ 350 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రి ముఖధ్వారం దగ్గర రోగులు కూరోవడానికి కూడా వీలులేకుండా దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రిలోని మురుగు కాలువల్లో చెత్తను తీసి రోజులు గడుస్తున్నప్పటికీ అక్కడ నుండి తొలగించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఆసుపత్రి అవరణలో అన్న క్యాంటిన్‌ వెనుక భాగంలో పిచ్చి మొక్కలతో, ఏపుగా పెరిగిన చెట్ట మధ్యలో పాములు తరుచూ తారసపడుతుంటాయి. రెండు రోజుల క్రితం జోడి కోడె నాగుల సయ్యాటలడుతూ ప్రజలకు తారస పడగా ఒక్కసారిగా అక్కడి వైద్యం కోసం వచ్చిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో పాములు ఆసుపత్రిలోకి వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. వర్షాకాలం కావడంతో చెట్లు మరింత ఏపుగా పెరిగి పాములకు ఆవాసంగా మారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆవకాశం లేకపోలేదు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని రోగులు కోరుతున్నారు.

Updated at - Jul 03 , 2026 | 12:31 AM