రాయలసీమకు అసలైన ముద్దుబిడ్డ ఎన్టీ రామారావు: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:41 PM
రాయలసీమ ఉద్యమం చచ్చేది కాదని.. రోజురోజుకూ బలపడుతూనే ఉంటుందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తాను సిద్ధమని అన్నారు.
కర్నూలు, జులై 19: రాయలసీమ ఉద్యమం చచ్చేది కాదని.. రోజురోజుకూ బలపడుతూనే ఉంటుందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తాను సిద్ధమని అన్నారు. నేడు రాయలసీమ ముద్దుబిడ్డపై పోటీ జరుగుతోందని తెలిపారు. రాయలసీమకు అసలైన ముద్దుబిడ్డ ఎన్టీ రామారావు అని ఆయన గుర్తు చేశారు. ఆదివారం కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో స్థానిక ప్రముఖ రచయిత పత్తి ఓబులయ్య రచించిన ‘సీమ రైతు కన్నీటి వేత’ పుస్తకాన్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌తో కలిసి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలోని సంస్కృతిని కొందరు పాడు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. రాయలసీమలో పుట్టడం తన అదృష్టమని చెప్పారు. రాయలసీమలో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చాలా గ్రామాల పేర్లు మారాయని పేర్కొన్నారు. వాటి పేర్ల మార్చాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు.
రాయలసీమలో అపారమైన సహజ సంపద, విలువైన ఖనిజాలతోపాటు పవిత్రమైన నదులు కూడా ఉన్నాయని వివరించారు. రాయలసీమకు అన్యాయం జరిగినప్పుడు తాను, టీజీ వెంకటేశ్ గళాన్ని వినిపిస్తామని అన్నారు. ఆసియాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని వివరించారు. రాయలసీమ అనేది సెంటిమెంటల్ ఇష్యూ అని తెలిపారు. ఏదో ఓ రోజు రాయలసీమ డిమాండ్ పెరుగుతుందని జోస్యం చెప్పారు.
టీజీ వెంకటేష్ తాను ఒకే వేదికపైకి రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తాము రాయలసీమ నినాదం చేస్తున్నామని.. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదని అన్నారు. రాయలసీమపై ప్రేమ అభిమానాన్ని ఇద్దరం ప్రజల్లోకి తీసుకెళ్లామని బైరెడ్డి రాజశేఖరరెడ్డి వివరించారు.