విపత్తుల నివారణకు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:26 AM
జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. విపత్తుల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వరదల వల్ల ప్రజలకు, పంటలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కుందూనది నుంచి పాలేరు, మద్దిలేరు వాగుల ద్వారా వరద నీరు కాలనీలు, గ్రామాల్లోకి ప్రవేశించకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బండ్లు, రక్షణ గట్లు బలోపేతం చేయాలన్నారు. మండల స్థాయిలో కూడా విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలనను క్రమం తప్పకుండా నిర్వహించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.