Share News

ఇటుకబట్టీ కూలీ.. నేడు యజమానిగా!

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:29 AM

కుప్పం ఇటుక బట్టీ కూలి విజయగాథ ఢిల్లీ చేరింది. అక్కడ గురువారం పీఏఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫైర్‌సైడ్‌ చాట్‌’లో మంత్రి లోకేశ్‌ ఆమె గురించి ప్రస్తావించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం కోటచెంబగిరికి చెందిన వెంకటలక్ష్మి ఇటుక బట్టీలో కూలీ...

ఇటుకబట్టీ కూలీ.. నేడు యజమానిగా!

  • ‘పీ4’తో.. ఢిల్లీకి చేరిన కుప్పం మహిళ విజయగాథ

  • ఫైర్‌సైడ్‌ చాట్‌లో వివరించిన మంత్రి లోకేశ్‌

కుప్పం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కుప్పం ఇటుక బట్టీ కూలి విజయగాథ ఢిల్లీ చేరింది. అక్కడ గురువారం పీఏఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫైర్‌సైడ్‌ చాట్‌’లో మంత్రి లోకేశ్‌ ఆమె గురించి ప్రస్తావించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం కోటచెంబగిరికి చెందిన వెంకటలక్ష్మి ఇటుక బట్టీలో కూలీ. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ4 (పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌) మోడల్‌లో భాగంగా కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ద్వారా అధికారులు బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. ఆ జాబితాలో వెంకటలక్ష్మి ఉన్నారు. పేదరాలైన వెంకటలక్ష్మికి పీ4 పథకం కింద టీవీఎస్‌ కంపెనీ రూ.1.60 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆ నిధుల వినియోగం, ప్రాజెక్టు ఎంపికలో సాయం చేసింది. కూలి పనుల ద్వారా తనకు బాగా తెలిసిన ఇటుక బట్టీ వ్యాపారాన్నే ఆమె ఎంచుకున్నారు. సొంతంగా బట్టీ పెట్టుకుని ఇటుకలు తయారు చేయడం ప్రారంభించారు. మూడు నెలలకోసారి ఇటుకల వ్యాపారం జరుగుతుంది.

వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం తనకు అన్ని ఖర్చులూ పోను ఏడాదికి నికరంగా రూ.4 లక్షల లాభం మిగులుతుందని వెంకటలక్ష్మి ఈనెల 21న కుప్పంలో స్వయంగా సీఎంతో చెప్పారు. తాను మరో 8 మందికి పని కల్పించినట్లు బహిరంగ సభలో సగర్వంగా ప్రకటించారు. ‘నీ లక్ష్యమేమిటమ్మా?’ అని సీఎం అడిగిన ప్రశ్నకు- ‘వ్యాపారాన్ని ఇంకా ఎక్కువ జెయ్యాలి సార్‌. ఇప్పుడున్న ఎనిమిదిమందితోపాటు ఇంకో పదిమందికి నేను పనివ్వాలి’ అని ఆమె ఆత్మవిశ్వాసంతో స్పందించారు. ఇదిగో.. వెంకటలక్ష్మి సాధించిన ఈ విజయగాథే, ఢిల్లీలో జరిగిన ‘ఫైర్‌సైడ్‌ చాట్‌’లో నారా లోకేశ్‌ ప్రస్తావించారు. తద్వారా పీ4 మోడల్‌ పేదరిక నిర్మూలన అనే లక్ష్యసాధనకు ఎంతగా ఉపకరిస్తోందో ఆయన వివరించారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:29 AM