అసలు విధులు వదిలేసి!
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:45 AM
కృష్ణా జలాల కేటాయింపులు సజావుగా సాగేందుకు.. రాష్ట్ర విభజన చట్టం మార్గదర్శకాల అమలుకు ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తన అసలు విధులను వదిలేసి అనవసర వ్యవహారాలపై దృష్టి పెడుతోంది.
శ్రీశైలం డీపీఆర్ కోరిన కృష్ణా బోర్డు
సాగర్ కేటాయింపులు, వాస్తవ వినియోగ లెక్కలు కూడా..
రెండు రాష్ట్రాలకూ కేఆర్‌ఎంబీ లేఖ
ఎప్పటి ప్రాజెక్టు.. ఎప్పుడు ప్రారంభమైంది?
నీటి కేటాయింపుల ఊసెత్తకుండా అక్కర్లేని వ్యవహారాలెందుకు?
బోర్డు తీరుపై సాగునీటి నిపుణుల ఆగ్రహం
(అమరావతి - ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల కేటాయింపులు సజావుగా సాగేందుకు.. రాష్ట్ర విభజన చట్టం మార్గదర్శకాల అమలుకు ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తన అసలు విధులను వదిలేసి అనవసర వ్యవహారాలపై దృష్టి పెడుతోంది. శ్రీశైలం జలాశయం డీపీఆర్‌ను పంపాలని.. నాగార్జునసాగర్ వాస్తవ నీటి కేటాయింపులు, వాడకం సమాచారాన్ని పంపాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అది రాసిన లేఖే దీనికి నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సహజంగా నదీ జలాల విషయంలో రాష్ట్రాలను సమన్వయం చేయాలంటే.. ఆయా నదులు, వాటిపై నిర్మించిన ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ట్రైబ్యునళ్లు చేసిన కేటాయింపులు, ట్రైబ్యునళ్లలో రాష్ట్రాల వాదనలు.. సుప్రీంకోర్టులో, విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్‌లో వాదనలు వంటి వాటిపై నదీ యాజమాన్య సంస్థలకు పూర్తి అవగాహన ఉండాలి.
అయితే రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం దాటినా కేఆర్‌ఎంబీ అధికారులు ఇప్పటికీ ఏపీ, తెలంగాణ నుంచి ప్రాథమిక సమాచారాన్ని మళ్లీ మళ్లీ కోరుతున్నారు. దీనిని రాష్ట్ర నీటి రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. 1960లో నల్లమల కొండల మధ్యలో శ్రీశైలం జలాశయం నిర్మాణ పనులు మొదలై.. 1981లో పూర్తయి.. ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాగు/తాగునీటి అవసరాలను తీర్చేందుకు.. జలవిద్యుదుత్పత్తి కోసం దీనిని నిర్మించారు. సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే జలవిద్యుదుద్పత్తి చేపట్టాలన్న షరతుతో కూడిన నిబంధనలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తకుండా ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నీటి పంపకాలు చేయాల్సిన ఈ బోర్డు.. ఆ బాధ్యతనే నిర్వర్తించడం లేదని నిపుణులు అంటున్నారు. టెలీమెట్రీల సాయంతో రాష్ట్రాలవారీ కృష్ణా జలాల వినియోగంపై నదీ పరీవాహక, ప్రాజెక్టుల వారీగా గణాంకాలను తయారు చేయాల్సిన బోర్డు.. ఇప్పటిదాకా అలాంటి చర్యలే చేపట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే.. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి వాడకాలపై ఎప్పటికప్పుడు కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను సవరిస్తూ వచ్చింది.
దీంతో డీపీఆర్‌కు, ఇప్పటి మార్గదర్శకాలకూ చాలా వ్యత్యాసాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయం వాస్తవ అనుమతులు, కాలువల ద్వారా నీటి వినియోగం, డీపీఆర్‌కు కాలానుగుణంగా వచ్చిన సవరణలు, సాంకేతిక అనుమతుల వంటి వివరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కాలయాపన చర్యల్లో భాగమేనని.. కేఆర్‌ఎంబీ తన అసలు విధులను పక్కనపెట్టిందని అంటున్నారు. అదీగాక.. విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండాలి. కానీ హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చేందుకు బోర్డు విముఖత చూపుతోంది. అద్దెరహిత అధునాతన కార్యాలయం కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ షరతులకు ఏపీ అంగీకరించినా అక్కడి నుంచి రావడం లేదు.
ఆ నీరు తాగునీటికే..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో కేవలం తాగునీటి అవసరాల కోసమే నీటి కేటాయింపులు జరపాలి. కానీ కేఆర్‌ఎంబీ ఈ ఏడాది నీటి కేటాయింపుల కోసం ఒక్క సమావేశాన్నీ నిర్వహించలేదు. సమావేశానికి రాలేమంటూ తెలంగాణ అధికారులు రాసిన లేఖలను పరిగణనలోకి తీసుకుని వాయిదాలు వేస్తూ పోతోంది. తాగునీటి అవసరాల కోసం.. శ్రీశైలం డ్యాంలో ఉన్న కొద్దిపాటి కృష్ణా జలాలను కేటాయించడానికి ఉభయ రాష్ట్రాలతో సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతోందో అర్థం కావడం లేదు. భౌతిక సమావేశాలు నిర్వహించలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఆస్కారం ఉందని.. లేనిపక్షంలో ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నిల్వ ఉన్న నీటిని 66:34 దామాషాలో రెండు రాష్ట్రాలకు కేటాయించే అధికారం కేఆర్‌ఎంబీకి ఉందని నిపుణులంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి: