Share News

నన్ను చంపాలని ప్రయత్నించారు: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు..

ABN , Publish Date - Jul 28 , 2026 | 09:09 AM

‘నన్ను ఇంట్లో మూడో అంతస్తులో బంధించి ఉంచేవారు. ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్‌తో నిఘా పెట్టేవారు. నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించారు. వారు మతం మారిన విషయాన్ని దాచారు’ అని వైసీపీ నేత జోగి రమేశ్‌ కుటుంబంపై ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు మేఘన సంచలన వివరాలు వెల్లడించింది.

నన్ను చంపాలని ప్రయత్నించారు: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు..
YSRCP Leader Jogi Ramesh

  • ఏపీ మాజీ మంత్రి జోగి కుటుంబంపై కోడలు ఫిర్యాదులో సంచలన అంశాలు

  • నిశ్చితార్థం తర్వాత పెళ్లికి కంగారు పెట్టారు

  • 5 కోట్లతో పెళ్లి..కట్నంగా కిలోన్నర బంగారం

  • అదనపు కట్నం, కారు కోసం వేధించారు

  • తాళి కట్టిన మర్నాడే రాజీవ్‌ విచిత్రప్రవర్తన

  • శారీరక లోపాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు

  • మతం మారిన విషయాన్ని చెప్పలేదు

  • అవమానాలు, వేధింపులు విఫులంగా వెల్లడి

  • అరెస్టు భయంతో రమేశ్‌ కుబుంబం పరార్‌


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): ‘నన్ను ఇంట్లో మూడో అంతస్తులో బంధించి ఉంచేవారు. ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్‌తో నిఘా పెట్టేవారు. నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించారు. రాజీవ్‌ (భర్త)కు ఉన్న శారీరక లోపాన్ని దాచి పెళ్లి చేశారు. వారు మతం మారిన విషయాన్ని దాచారు’ అని వైసీపీ నేత జోగి రమేశ్‌ కుటుంబంపై ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు మేఘన సంచలన వివరాలు వెల్లడించింది. 2025 మే 28న వివాహమైన తర్వాత నుంచి ఎదురైన అవమానాలు, హత్యాయత్నాలను విపులంగా పేర్కొంది. ఫిర్యాదులో ఆమె రాసిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘షాలిని మ్యారేజ్‌ బ్యూరో ద్వారా జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ సంబంధం వచ్చింది. జోగి రమేశ్‌ దంపతులు, వారి కుమారుడు నా ఫ్రెండ్స్‌తో కలిసి రాజీవ్‌ సూర్యాపేటలోని విద్యానగర్‌లో మా ఇంటికి 2025 ఏప్రిల్‌ 15న వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారు. మే 8న నిశ్చితార్థం, 28న సూర్యాపేటలో వివాహమైంది.


పెళ్లి పీటలు దిగిన మర్నాడే..

పెళ్లికి మా తల్లిదండ్రులు రూ.5కోట్లు ఖర్చు చేశారు. 1.5కిలోల బంగారం, 10కిలోల వెండి కట్నం ఇచ్చాం. ఆడపడుచు కట్నంగా రూ.9 లక్షలు, రాజీవ్‌కు కానుకగా రూ.లక్ష ఇచ్చాం. అయినా అదనంగా రూ. 5 కోట్ల కట్నం, ఫార్చూనర్‌ కారు కావాలని నిత్యం చిత్రహింసలు పెట్టేవారు. రాజీవ్‌ నా మెడలో తాళికట్టిన రెండో రోజు నుంచే అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడు. సంసార జీవితానికి పనికిరాకుండా ఉన్న అతని శారీరక లోపాన్ని దాచిపెట్టి వివాహం చేశారు. జోగి రమేశ్‌ కుటుంబం మతం మారింది. ఈ విషయాన్ని మా కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నేను ఇంట్లో పూజలు చేసుకుంటే సూటిపోటి మాటలతో వేధించేవారు. అగరవత్తులు వెలిగిస్తే.. ఇంట్లో పీనుగుల వాసన వస్తోందంటూ అవహేళన చేసేవారు.


అడ్డు తొలగించుకోవాలని..

నా అడ్డు తొలగించుకోవడానికి జోగి కుటుంబం మూడుసార్లు ప్రయత్నించింది. 2025 జూలై 4న గోవా విహారయాత్రకు తీసుకెళ్లారు. ఒకసారి ఒంటరిగా చీకటి ప్రదేశంలో వదిలేశారు. తర్వాత ఓడలో జరిగే క్యాసినోకు రాజీవ్‌ తీసుకెళ్లాడు. అక్కడ ఓడ పైనుంచి నీటిలోకి తోసేయడానికి ప్రయత్నించాడు. జోగి రమేశ్‌కు హైదరాబాద్‌ నార్సింగిలో విల్లా, ఘట్‌కేసర్‌లో ఫాంహౌస్‌ ఉన్నాయి. 2025 జూలై 10న నార్సింగిలోని విల్లా నుంచి ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ భర్త రాజీవ్‌, మామ రమేశ్‌, అత్త శకుంతల, మరిది రోహిత్‌, ఆడపడుచు రేష్మ ప్రియాంక నాపై దాడి చేసి గాయపరిచారు. ముఖంపై దిండుపెట్టి చంపేయడానికి ప్లాన్‌ చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ రోడ్డులో శకుంతల నిలయం పేరుతో రమేశ్‌కు సొంతిల్లు ఉంది. ఇందులో మూడో అంతస్తులో నన్ను బంధించి ఉంచేవారు. అక్కడ ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్‌తో నిఘా పెట్టారు.


ఒకరోజు టెర్రస్‌పై నిలబడి ఉండగా రమేశ్‌, అతని సోదరుడు రాము, బావమరిది స్వామి నన్ను కిందికి తోసేయాలని స్కెచ్‌ వేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 13న వాళ్లంతా కలిసి నాపై దాడి చేశారు. రాజీవ్‌కు ఉన్న సమస్యను, మతం మారిన విషయాన్ని బయటకు చెబుతావా అంటూ నన్ను రమేశ్‌ బెదిరించారు. రమేశ్‌ నా ముఖంపై దిండు పెట్టి నొక్కగా, మెడకు భర్త రాజీవ్‌ చున్నీ బిగించాడు. ప్రాణాలు రక్షించుకోవడానికి కాళ్లపై పడి ప్రాధేయపడడంతో ఆ సమయంలో వదిలిపెట్టారు’ అని మేఘన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనను ఎక్కడ అరెస్టు చేస్తారనే భయంలో సోమవారం జోగి రమేశ్‌ కుటుంబంతో సహా పరారయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

బాలామృతానికి తెలంగాణే భరోసా!

'మేము కూడా బాధితులమే'.. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Updated Date - Jul 28 , 2026 | 09:09 AM