Sankranti Cockfights: ఎగిరిన కోడి.. తెగిన కట్టలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 09:01 AM
సంక్రాంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, పేకాట శిబిరాలు యథేచ్చగా సాగాయి. ముఖ్యంగా గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డులోని గౌతమ్ స్కూల్ వెనుక, గుడివాడ మండలం టిడ్కో కాలనీ వద్ద, రామనపూడి క్వాలిటీ ఫీడ్స్ పక్కన భారీ స్థాయిలో కోడి పందాలు, పేకాట శిబిరాలను నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి- గుడివాడ): సంక్రాంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, పేకాట శిబిరాలు యథేచ్చగా సాగాయి. ముఖ్యంగా గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డులోని గౌతమ్ స్కూల్ వెనుక, గుడివాడ మండలం టిడ్కో కాలనీ వద్ద, రామనపూడి క్వాలిటీ ఫీడ్స్ పక్కన భారీ స్థాయిలో కోడి పందాలు, పేకాట శిబిరాలను నిర్వహించారు. నందివాడ మండలంలోని నందివాడ, పుట్టగుంట, పోలుకొండ, తమిరిశ, గుడ్లవల్లేరు మండలంలోని గుడ్లవల్లేరు, కౌతవరం, కుచ్చికాయలపూడి, అంగలూరు, కూరాడ, డోకిపర్రులలో కోడిపందేలు, పేకాట విచ్చలవిడిగా నిర్వహించారు. ముఖ్యంగా లోనా, బయట విచ్చలవిడిగా సాగింది, గుండాట బహిరంగంగానే నిర్వహించారు.
రెండు చోట్ల బైక్లు, స్కూటీల బహూకరణ
గుడివాడ టిడ్కో కాలనీ, గుడ్లవల్లేరు వద్ద జరిగిన నిర్దిష్ట కోడిపందేల్లో గెలిచిన వారికి బైక్లను బహుమతులుగా అందజేశారు. టిడ్కో కాలనీ బరిలో రెండు బుల్లెట్లు, తొమ్మిది యూనికార్న్ లు, గుడ్లవల్లేరులో ఆరు స్కూటీలను నిర్వాహకులు ప్రకటించారు. దీనిలో తొలి రోజు పందేల్లో గుడ్లవల్లేరు బరిలో గెలిచిన వారికి మూడు స్కూటీలను అందజేశారు.
బుడమేరులో భారీ పేకాట శిబిరం
నందివాడ మండలం, ఇలపర్రు, ఏలూరు జిల్లా, పెదపాడు మండలం శివారుల్లో బుడమేరులో భారీ పేకాట శిబిరాన్ని నిర్వహించారు. లోనా బయట భారీస్థాయిలో జరిగింది.
పందెపురాయుళ్లతో ట్రాఫిక్ జామ్
హనుమాన్ జంక్షన్ రూరల్: కృష్ణా, ఏలూరు జిల్లాల సరిహద్దులో బిళ్లనపల్లి రోడ్డులోని మీర్జాపురం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బరిలో కోడిపందాలు వీక్షించేందుకు, జూదం ఆడేందుకు వచ్చే వారి కార్లతో మల్లవల్లి పారిశ్రామికవాడకు వెళ్లే రహదారి ట్రాఫిక్ జామ్ అయింది. నిర్వాహకులు ఏర్పాటు చేసిన పార్కింగ్ కూడా కార్లతో నిండిపోవడంతో ఎంఎన్‌కే రహదారికి ఇరువైపులా కార్లను నిలిపివేసి కోడిపందాలను చూసేందుకు కుటుంబాలతో సహా తరలివచ్చారు. వీక్షకులు, కుటుంబాలతో సహా వేలాదిగా తరలిరావడంతో బిళ్లనపల్లి ప్రధాన రహదారి కార్లతో, టైక్లతో నిండిపోయి గ్రామస్తులకు ఇబ్బందిగా తయారైంది. అటు మీర్జాపురం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన బరి తిరునాళ్లను తలపిస్తోంది.
బంటుమిల్లి: భోగి రోజున కోడిపందేలు, పేకాట జోరుగా సాగాయి. 216 జాతీయ రహదారికి అడుగుదూరంలో పెందుర్రు, బంటుమిల్లి, మల్లేశ్వరం, ఆర్తమూరు గ్రామాలల్లో భారీఎత్తున పందేలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. పెందుర్రులో 13 పందేలకు గాను 9 పందేలు గెలిచిన కోన గ్రామానికి చెందిన గద్దె సతీశ్ కు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ షిఫ్ట్ కారును బహూకరించారు.