ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Feb 07 , 2026 | 07:27 PM
విజయవాడలో జరిగిన 'వికసిత్ భారత్ బడ్జెట్ 2026' సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని లోకేష్ అన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 7: భారతదేశ ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని ఏపీ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం టెక్నాలజీస్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
చాట్ జీపీటీతోనే నా ప్రయాణం మొదలైంది
ఈ సందర్భంగా లోకేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటో నేను మొదటిసారి చాట్ జీపీటీ (ChatGPT)ని అడిగి తెలుసుకున్నాను. కానీ, అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. ఆయన విజన్ ఎప్పుడూ టెక్నాలజీ కంటే ముందే ఉంటుంది' అని కొనియాడారు.
ప్రపంచంలోనే టాప్-3 'క్వాంటం వ్యాలీ'గా అమరావతి
అమరావతి నగరం కేవలం పరిపాలనకే పరిమితం కాదని.. అది టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఇన్నోవేషన్‌కు హబ్ అని లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 3 'క్వాంటం వ్యాలీ'లలో ఒకటిగా నిలబెట్టడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఒక 'స్టార్టప్ స్టేట్' అని, అభివృద్ధి కోసం తాము ఎంతో ఆకలితో ఉన్నామని, అందుకే శరవేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ఈ ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే 'క్వాంటం వ్యాలీ' అనే వినూత్న ఆలోచనకు మూలకారకులైన కామకోటి గారికి (IIT Madras Director) లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ దే!
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో ప్రపంచ పటంలో నిలిపారని, నేడు అమరావతిని క్వాంటం టెక్నాలజీ ద్వారా గ్లోబల్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలుపుతామని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్, క్వాంటం రంగాల్లో వస్తున్న భారీ పెట్టుబడులు ఏపీ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్