Investment Talks: నేడు దిగ్గజ కంపెనీలతో సీఎం చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:43 AM
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
దావోస్ వేదికగా పెట్టుబడుల వేట
ఐబీఎం, గూగుల్ క్లౌడ్ సీఈవోలతో చర్చలు
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్ వంటి సంస్థలతో ముఖాముఖీ భేటీలను నిర్వహించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక సాంకేతికత, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై సీఎం దృష్టి సారించనున్నారు. ఉదయం సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగిస్తారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో తీసుకుంటున్న నిర్ణయాలను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పన, మానవ వనరుల నైపుణ్యం వంటి అంశాల్లో తీసుకుంటున్న శ్రద్ధ, అమలు చేస్తున్న చర్యలను తెలపనున్నారు. టీమ్ ఇండియా లాంజ్‌లో ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రపంచ పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణతో సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తోనూ భేటీ అవుతారు.
దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తితో కొద్దిసేపు ముచ్చటిస్తారు. సాయంత్రం జేఎ్‌సడబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్థి జిందాల్‌తో సమావేశమవుతారు. అంతర్జాతీయ కంటేయినర్ లాజిస్టిక్స్ సంస్ధ మోలర్ మేర్క్స్ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో ముఖాముఖీ చర్చలు జరుపుతారు. పలు దిగ్గజ సంస్థల యాజమాన్యాలు, చైర్మన్లను కలుస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు లోకేశ్, టీజీ భరత్ పాల్గొంటారు. ’వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Indian Ambassador Mridul Kumar: జ్యూరిక్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం
Indian Ambassador Mridul Kumar: ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి