అమరావతిలో 500 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
ABN , Publish Date - May 07 , 2026 | 08:26 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. వైద్య రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. ప్రముఖ వైద్య సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) తన శాఖను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఏపీ సీఆర్‌డీఏ అధికారులతో కిమ్స్ యాజమాన్యం లీజు ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతి, మే 7: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వైద్య రంగంలో మరో భారీ మైలురాయిని అధిగమించింది. ప్రజారాజధానిలో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రముఖ వైద్య సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) తన శాఖను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఏపీ సీఆర్‌డీఏ (APCRDA) అధికారులతో కిమ్స్ యాజమాన్యం గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదుర్చుకుంది.
నిడమర్రులో 2 ఎకరాల కేటాయింపు
అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామ పరిధిలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ సీఆర్‌డీఏ 2 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఈ ఒప్పంద పత్రాలపై సీఆర్‌డీఏ తరపున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ చిరాన్ రాయ్ సంతకం చేసి, కిమ్స్ ప్రతినిధులకు పత్రాలను అందజేశారు.
ఆసుపత్రి ప్రత్యేకతలు:
మొత్తం 500 పడకలతో ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ వంటి అన్ని రకాల కీలక విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రి ఏర్పాటుతో అమరావతి రాజధాని ప్రాంత ప్రజలకే కాకుండా, పరిసర జిల్లాల ప్రజలకు కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ వైద్యం చేరువ కానుంది.
కాగా, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, వైద్య, విద్యా రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఇక్కడ కొలువుదీరగా, ఇప్పుడు కిమ్స్ వంటి దిగ్గజ ఆసుపత్రి రాకతో అమరావతి హెల్త్ హబ్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest Telangana News And Telugu News