18 వేల కోట్లతో ‘కియా’ విస్తరణ
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:35 AM
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.18 వేల కోట్లతో తమ ప్లాంటును విస్తరించనున్నట్టు ‘కియా’ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గ్వంగూ లీ వెల్లడించారు.
12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
విశాఖపట్నం/పుట్టపర్తి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.18 వేల కోట్లతో తమ ప్లాంటును విస్తరించనున్నట్టు ‘కియా’ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గ్వంగూ లీ వెల్లడించారు. సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. కొత్త ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కియా ఇండియా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.3 లక్షల వాహనాల నుంచి 6.3 లక్షల వాహనాలకు పెరుగుతుందన్నారు. ఏపీలో 2017లో కియా ప్రస్థానం ప్రారంభమైందని, చంద్రబాబు సహకారంతో 14 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు. నాలుగేళ్లలోనే 10 లక్షలు, ఏడేళ్లలో 20 లక్షల వాహనాల ఉత్పత్తిని సాధించామన్నారు. 100 దేశాలకు 4.1 లక్షలకుపైగా వాహనాలు, విడిభాగాల కిట్లను ఎగుమతి చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి తయారీ, నూతన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. విస్తరణ అనంతరం ఏడాదికి అదనంగా మరో 2 లక్షల కార్లను పెనుకొండ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
తొమ్మిదేళ్ల కిందట తొలి అడుగు
దక్షిణ కొరియా నుంచి కియా బృందం 2016 జూలై 22న తొలిసారిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అడుగుపెట్టింది. పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద కార్ల పరిశ్రమ ఏర్పాటుకు 2017 ఏప్రిల్ 20న అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2017 ఆగస్టులో మొదలైన ప్రధాన ప్లాంట్ పనులు 18 నెలల్లో పూర్తయ్యాయి. 2019 జనవరి 29న కార్ల ఉత్పత్తిని చంద్రబాబు ప్రారంభించారు. మేడిన్ ఇండియాలో తొలికారు సెల్టో్స్ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. 2024 జూలైలోనే పలు మోడళ్లతో పది లక్షల కార్ల ఉత్పత్తి మైలురాయిని దాటేసి చరిత్ర సృష్టించారు. కియా పరిశ్రమ రూ. 13,500 కోట్ల పెట్టుబడితో లక్షల కార్లను ఉత్పత్తి చేయడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు విస్తరణతో ఉత్పత్తి, ఉపాధి మరింత పెరగనుంది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు