నాపై ఆరోపణలు చేస్తే నిజాలు వెల్లడిస్తా
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:42 AM
తన వల్లే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జైలు పాలయ్యారంటూ వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కారుమూరి మాజీ పీఏ అడ్డగర్ల శ్రీమన్నారాయణ (శ్రీమాన్) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే తన దగ్గరున్న ఆధారాలు, వాస్తవాలతో మాట్లాడవలసి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు
కారుమూరి గురించి నాకే ఎక్కువ తెలుసు
వైసీపీ నేతలపై మాజీ మంత్రి పీఏ శ్రీమాన్ ఆగ్రహం
తణుకు రూరల్, అగస్టు 28(ఆంధ్రజ్యోతి): తన వల్లే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జైలు పాలయ్యారంటూ వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కారుమూరి మాజీ పీఏ అడ్డగర్ల శ్రీమన్నారాయణ (శ్రీమాన్) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే తన దగ్గరున్న ఆధారాలు, వాస్తవాలతో మాట్లాడవలసి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. తన వల్లే కారుమూరి జైలుకెళ్లారంటూ వైసీపీ లీగల్ సెల్ నాయకుడు వెలగల సాయిబాబా రెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. తనను ఐదు రోజుల పాటు ఈడీ విచారించిందని, నాయకులందరికీ ముందస్తుగా చెప్పి విచారణకు వెళ్లానని.. వచ్చాక ప్రతీ విషయాన్ని వారికి వివరించానన్నారు. తన ఖాతాలో డబ్బులు పడ్డాయి కాబట్టే విచారణకు పిలిచారని అన్నారు. ఆరోజు తన బాధనంతా నాయకులకు వివరించినా కూడా న్యాయ సహాయం కోసం న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కారుమూరి వద్ద పీఏగానే కాకుండా ఆరేళ్లు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కూడా పని చేశానని.. కారుమూరి విషయాలు ఆ నేతల కంటే తనకే ఎక్కువ తెలుసన్నారు. పీఏగా పని చేసినపుడు ప్రతీ లావాదేవీకి తన వద్ద లెక్కలు, ఆధారాలు ఉన్నాయని అన్నారు.
కారుమూరితో బొత్స ములాఖత్
చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో శుక్రవారం వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ములాఖత్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసుపై ఆరా తీశారు. ఏపీ మద్యం రవాణా కేసులో ఈడీ కారుమూరిని 23న అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఇదే కేసులో ఆయన కుమారుడు సునీల్ కూడా ఈ జైల్లోనే ఉన్నారు.