విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:24 AM
‘యువ ఆవిష్కర్తలకు నిధుల కొరత లేదు. టైర్-2, 3 నగరాల్లో స్టార్టప్‌ల సంస్కృతిని ప్రోత్సహించేందుకు దాదాపు రూ.250 కోట్ల ఇండియా ఇంపాక్ట్ ఫండ్ అందుబాటులో ఉంది. ఒక్కో స్టార్టప్‌కు రూ.కోటి చొప్పున ప్రారంభ పెట్టుబడిని సీడ్ గ్రాంట్ ద్వారా అందిస్తారు.
ఆవిష్కర్తలుగా స్టార్టప్ రంగంలోకి రావాలి
ఇన్నోవేటర్స్ కాంక్లేవ్‌లో వక్తల పిలుపు
అనంత జేఎన్‌టీయూ ప్రారంభమైన సదస్సు
అనంతపురం వైద్యం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘యువ ఆవిష్కర్తలకు నిధుల కొరత లేదు. టైర్-2, 3 నగరాల్లో స్టార్టప్‌ల సంస్కృతిని ప్రోత్సహించేందుకు దాదాపు రూ.250 కోట్ల ఇండియా ఇంపాక్ట్ ఫండ్ అందుబాటులో ఉంది. ఒక్కో స్టార్టప్‌కు రూ.కోటి చొప్పున ప్రారంభ పెట్టుబడిని సీడ్ గ్రాంట్ ద్వారా అందిస్తారు. ఇందులో పట్టణ విద్యార్థుల ఆవిష్కరణలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది’ అని పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. అనంతపురం జేఎన్టీయూలో రెండు రోజుల అంతర్జాతీయ నూతన ఆవిష్కర్తల సమాలోచన సదస్సు (ఇన్నోవేటర్స్ కాంక్లేవ్) శనివారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు మాట్లాడుతూ సమాజంలో ఏదైనా సమస్యను పరిష్కరించగల వినూత్న ఆలోచన విద్యార్థుల వద్ద ఉంటే, దాన్ని పరిశ్రమగా మార్చేందుకు జేఎన్‌టీయూఏ మార్గదర్శిగా వ్యవహరించి సహకరిస్తుందని పేర్కొన్నారు. మన రాష్ట్ర యువతను ఉద్యోగాలు అడిగే వారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే ఆవిష్కర్తలుగా మార్చడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఏ చౌదరి మాట్లాడుతూ స్టార్టప్ రంగంలో విద్యార్థుల ఆలోచనలకు మద్దతుగా పెట్టుబడి పెట్టడానికి ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
జేఎన్టీయూఏలో ఒక ప్రత్యేక ‘స్టార్టప్ చాలెంజ్’ నిర్వహించబోతున్నామని, చిన్న నగరాల (టైర్-2, 3) విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితేయడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ‘స్టార్టప్ చాలెంజ్’ ద్వారా ఎంపికైన 101 స్టార్టప్‌లకు ఒక్కో దానికి రూ.కోటి చొప్పున సీడ్ గ్రాంట్ అందజేస్తామని వెల్లడించారు. అనంతరం పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విద్యార్థులు బృందాలుగా చర్చలు జరిపి, ప్రాజెక్టుల ప్రాణాళికలు రూపొందించారు.
ఈ వార్తలనూ చదవండి: