Share News

ఏపీలో జపాన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:58 AM

ఆంధ్రప్రదేశ్‌లో ‘జపాన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’ ఏర్పాటుకు తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని జపాన్‌ రాయబారి కెయిరీ ఓనో వెల్లడించారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సులో...

ఏపీలో జపాన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌

  • విశాఖలో కొత్తగా జీసీసీ ఏర్పాటు చేస్తాం

  • సీఎం చంద్రబాబుతో జపాన్‌ రాయబారి కెయిచీ ఓనో

ఆంధ్రప్రదేశ్‌లో ‘జపాన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’ ఏర్పాటుకు తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని జపాన్‌ రాయబారి కెయిరీ ఓనో వెల్లడించారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన బుధవారం సాయంత్రం నోవోటెల్‌ హోటల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు జపాన్‌ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నాయని ఓనో చెప్పారు. శ్రీసిటీలో ఇప్పటికే కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 20 సెక్టోరియల్‌ ఇండస్ట్రియల్‌ పార్కుల్లో పెట్టుబడులకు జపాన్‌కు చెందిన మారుబెని, సుమిటోమో, మిత్సుయి సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌, మౌలిక వసతులు, కీలక ఖనిజాల సరఫరా, గ్రీన్‌ ఎనర్జీ తదితర అంశాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూల రాష్ట్రమని, పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పారదర్శకమైన రాయితీల విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అందించే రాయితీల కోసం ఎస్ర్కో ఖాతా విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. జపాన్‌ కంపెనీలు ముందుకువచ్చి శిక్షణ ఇస్తే ఇక్కడి యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికి కెయిచీ ఓనో స్పందిస్తూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో పూర్తి సహకారం అందిస్తామన్నారు. జపాన్‌కు చెందిన సుజుకి, హోండా, కొమాట్సు, కవాసాకి, యమహా తదితర కంపెనీలు వ్యాపార విస్తరణలో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతులు వినియోగించుకోవాలన్నారు.


మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ నిర్మిస్తున్న షిప్‌ బిల్టింగ్‌ క్లస్టర్‌లో జపాన్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా చూడాలన్నారు. మిత్సుబిషి, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్‌, ఇమాబారి వంటి సంస్థలను భాగస్వాములను చేయాలని చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే అమార్ఫస్‌ మెటల్‌ను భారత్‌లోనే తయారుచేయాలని ప్రొటీరియల్‌ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్టు జపాన్‌ రాయబారి తెలిపారు. భారత్‌, జపాన్‌ సహకారంతో ఈ ఏడాది విశాఖలో కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ప్రారంభించినట్లు జపాన్‌ ప్రతినిధులు తెలిపారు. ఏడాదికి 70 వేల టన్నుల చొప్పున ఐదేళ్లు గ్రీన్‌ అమ్మోనియా కొనుగోలు చేసేందుకు ఏఎం గ్రీన్‌తో జపాన్‌కు చెందిన జెరా సంస్థ ప్రాథమిక ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:00 AM