ద్వారంపూడి అనుచరులకు జనసేన టికెట్లు!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:53 AM
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులకు జనసేన తరఫున కార్పొరేట్లుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కడం రాజకీయంగా దుమారం రేపింది.
కాకినాడలో 3 చోట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు
కాకినాడ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులకు జనసేన తరఫున కార్పొరేట్లుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కడం రాజకీయంగా దుమారం రేపింది. కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ నుంచి జనసేన తరఫున నీలపల్లి రమణి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈమె భర్త నీలపల్లి కామరాజు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు.
గత వైసీపీ హయాంలో ద్వారంపూడితో కలిసి పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇదంతా తెలిసి కూడా జనసేనలో ఓ వర్గం నేతలు కామరాజు కుటుంబానికి మద్దతు ఇవ్వడం దుమారం రేపింది. ఇటీవల ఈసీటు కేటాయింపుపై కూటమి నేతల సమావేశంలో కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నిలదీశారు. ద్వారంపూడి అనుచరుడి భార్యకు టికెట్ ఇవ్వొద్దని కోరారు. అటు జనసేనలో ఒక వర్గం కూడా రమణికి టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే, జనసేనకు చెందిన తోట సుధీర్ మద్దతుదారులు మాత్రం సమర్థిస్తున్నారు. 37, 41 డివిజన్లలోను ద్వారంపూడి అనుచరులు జనసేన తరఫున నామినేషన్లు వేయడంతో వారి టికెట్లను కూడా రద్దు చేయాలని కూటమి నాయకులు పట్టుబడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్