Ananthapuram News: తప్పు నాదే.. సారీ.. విద్యార్థినులకు కేఎస్ఎన్ పీడీ బుజ్జగింపులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:37 PM
సారీ.. తప్పు నాదే.. అంటూ కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్ విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ ఆయన విద్యార్థినులను కోరుతున్నారు. ఈ వ్యవహారాని సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
-విచారణ పక్కదారి..?
- సొంత కళాశాల అధ్యాపకులతో కమిటీ
- పది రోజుల క్రితమే సెలవులోకి పీడీ
అనంతపురం: ‘తప్పు నాదే.. సారీ... కాంప్రమైజ్ అవ్వండి... తరువాతి క్రీడాపోటీలకు అవకాశం కల్పిస్తా.. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్(Srinivas).. బాధిత విద్యార్థినులను ఫోన్‌లో బుజ్జగించారు. తాము క్రీడలను వదులుకునేందుకైనా సిద్ధమనీ, తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రం కుండబద్దలు కొడతామని వారు తెగేసి చెప్పారు. పీడీపై వచ్చిన ఆరోపణలపై సోమవారం కళాశాలలో విచారణ సాగింది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కిందట ఆ పీడీ.. విద్యార్థినులతో ఫోన్ ద్వారా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
కళాశాలలోని పలువురు క్రీడాకారిణులకు సెలెక్షన్స్‌లో అన్యాయం చేస్తున్నారని పీడీపై ఫిర్యాదులు అందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పీడీపై విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ధర్నాలు చేయడంతోపాటు కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాయి. ఆ క్రమంలోనే జిల్లాకొచ్చిన అప్పటి ఆర్జేడీ కళాశాలను సందర్శించి విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. దీనిపై ప్రత్యేక విచారణ కమిటీ వేస్తామని తెలిపారు. ఆర్జేడీ గతేడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ పొందడంతో విచారణ అటకెక్కింది.
సొంత అధ్యాపకులతో కమిటీ..
కళాశాలలో ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే బయటి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, విచారణకు ఆదేశిస్తారు. పీడీ విషయంలో మాత్రం సొంత కళాశాలలోని అధ్యాపకులనే విచారణ బృందంగా ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కళాశాలలోని ఏడుగురు అధ్యాపకులను కమిటీ సభ్యులుగా చేర్చి సోమవారం విచారణ చేపట్టారు. దీనివెనుక పీడీని చర్యల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పదిరోజుల కిందటే పీడీ సెలవులో వెళ్లినట్లు తెలిసింది. ఇవన్నీ పరిశీలిస్తే... అంతా ఏకమై పీడీని చర్యలు నుంచి తప్పించేందుకు యత్నిస్తున్నట్లు కళాశాలలో తీవ్ర చర్చలు వినిపిస్తున్నాయి.

విచారణలో తగ్గేదేలే...
కేఎస్ఎన్ పీడీపై వస్తున్న ఆరోపణలపై కళాశాల విచారణ కమిటీని నియమించింది. సోమవారం ఆ కమిటీ సభ్యులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ విద్యార్థినులను విచారించారు. ‘నిజంగా పీడీ వేధించారా..? షూలేస్ కట్టించుకున్నారా..? క్రీడల సెలెక్షన్స్ నుంచి తప్పించారా..?’ తదితర ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. విద్యార్థినులు తగ్గేదేలా అన్నట్లుగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూనే... పీడీ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులను రాతపూర్వకంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. పీడీని విచారణకు పిలువగా... తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొచ్చినట్లు తెలిసింది.
కళాశాల అధ్యాపకులతో కమిటీ వేశాం..
పీడీపై విద్యార్థినులు ఫిర్యాదు చేసిన సమయంలో సెలవులో ఉన్నా. కొన్నిరోజుల క్రితమే జాయిన్ అయ్యా. సమస్య నా దృష్టికి వచ్చింది. వెంటనే కళాశాలలోని అధ్యాపకులతో విచారణ కమిటీని వేశాం. వారిచ్చే నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. తాజాగా ఎస్కేయూ నుంచి విచారణ నివేదికతోపాటు పీడీ వివరణ ఇవ్వాలని సర్కులర్ జారీ చేశారు.
- సత్యలత, ప్రిన్సిపాల్, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News