Share News

ప్రైవేటు ‘పీఎస్ఎల్వీ మరింత జాప్యం

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:24 AM

ప్రైవేటుగా నిర్మించిన పీఎస్ఎల్వీ రాకెట్‌ ప్రయోగం (పీఎస్ఎల్వీ-ఎన్‌1) మరింత జాప్యం కానుంది.

ప్రైవేటు ‘పీఎస్ఎల్వీ మరింత జాప్యం

  • ఈ ఏడాదీ పీఎస్ఎల్వీ-ఎన్‌1 ప్రయోగం లేనట్టే

  • 2027 తొలి త్రైమాసికంలో చేపట్టే అవకాశం

  • వరుసగా రెండు పీఎస్ఎల్వీల వైఫల్యాలతో ఆలస్యం

శ్రీహరికోట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటుగా నిర్మించిన పీఎస్ఎల్వీ రాకెట్‌ ప్రయోగం (పీఎస్ఎల్వీ-ఎన్‌1) మరింత జాప్యం కానుంది. ఈ ఏడాది శ్రీహరికోటలోని షార్‌ నుంచి రెండు ప్రైవేటు నిర్మిత పీఎస్ఎల్వీ రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో మొదటిదైన పీఎస్ఎల్వీ-ఎన్‌1 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి అనుమతి రాకపోవడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది.

మన రాకెట్ల ద్వారా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పటికే 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టి వాణిజ్యపరంగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే... అందుకు తగ్గట్లు వాహకనౌకల (రాకెట్ల) తయారీలో ఆలస్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను అధికమించాలని భావించిన ఇస్రో.. ప్రైవేటు సంస్థల ద్వారా పీఎస్ఎల్వీ రాకెట్లను తయారు చేయించాలని నిర్ణయించింది.

ఈ మేరకు 2022లో ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్ఐఎల్) రూ.860 కోట్ల విలువైన ఒప్పందం కింద హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, లారెన్స్‌ అండ్‌ టూబ్రో కన్సార్టియంకు ఐదు పీఎస్ఎల్వీ రాకెట్ల తయారీ పనులు అప్పగించింది. ఈ ఒప్పందం మేరకు 24 నెలల్లో అంటే.. 2024 నాటికి మొదటి రాకెట్‌ను సిద్ధం చేసి అప్పగించాల్సి ఉంది. అనంతరం ప్రతి ఆరు నెలలకొక రాకెట్‌ను తయారు చేసి ఇవ్వాలి.

ఇలా 2026 నాటికి మొత్తం ఐదు రాకెట్లు అందించాలి. ఇవన్నీ షెడ్యూల్‌ ప్రకారం జరిగి ఉంటే.. 2025లోనే మొదటి పీఎస్ఎల్వీ-ఎన్‌1 ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాలతో సరఫరా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పీఎస్ఎల్వీ-ఎన్‌1 ప్రయోగం చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. అదికూడా వాయిదా పడింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.


జాప్యానికి కారణాలెన్నో..

ప్రైవేటు నిర్మిత పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం ఆలస్యం కావడానికి అనేక కారణాలున్నాయి. గతంలో శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఏడాదికి ఐదుకి పైగా రాకెట్‌ ప్రయోగాలు జరిగేవి. 2023లో ఏకంగా ఏడు ప్రయోగాలు చేపట్టారు. 2025 మే 18న, 2026 జనవరి 12న చేపట్టిన పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ప్రయోగాలు వరుసగా విఫలమయ్యాయి. పీఎ్‌సఎల్‌వీ-61 రాకెట్‌లో పీఎ్‌స3లో పీడనం తగ్గడంతో విఫలమైంది. పీఎస్ఎల్వీ-62 రాకెట్‌ పేలోడ్లను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడంలో విఫలమైంది. అయితే వీటికి సంబంధించి అంతరిక్ష శాఖ, కేంద్ర ప్రభుత్వం వివరణాత్మక నివేదికలను మాత్రం ప్రకటించలేదు. పీఎ్‌సఎల్వీలోని వైఫల్యాలు మాత్రం మూడో దశకు సంబంధించినవే. ఈ రెండు వైఫల్యాల తర్వాత రాకెట్‌లో సాంకేతిక సమస్యలను సరిదిద్దే పనిలో ఇస్రో నిమగ్నమైంది. దీనివల్ల కూడా ఈ ప్రయోగాలు ఆలస్యమయ్యాయి.

పీఎస్ఎల్వీ ప్రయోగం తర్వాతే..

షార్‌లో పీఎ్‌సఎల్‌వీ-63 ప్రయోగం తర్వాతే ప్రైవేటు నిర్మిత పీఎస్ఎల్వీ-ఎన్‌1 ప్రయోగం చేపట్టాలని ఇస్రోపెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, ఆ తర్వాత ప్రైవేటు కన్సార్టియం నిర్మిత పీఎస్ఎల్వీ-ఎన్‌1 ప్రయోగం చేయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 04:30 AM