Share News

ప్రజల కోసం నిలబడితే.. వారే మనవెంట నిలబడతారు

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:32 AM

‘ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్రపూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.

ప్రజల కోసం నిలబడితే.. వారే మనవెంట నిలబడతారు

  • మూడేళ్లనాటి కుట్రపూరిత పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది: చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్రపూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం జరగిన తన అక్రమ అరెస్టును గుర్తు చేసుకుంటూ ఈయన ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్టు చేశారు. 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు, లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్బంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు. కానీ దేశవిదేశాల్లో నా కోసం జనం ఎత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజల మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి, నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం... ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలుగు జాతిని నంబర్‌ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

నంబర్‌ 1 స్థానంలో ‘నిజం గెలిచింది’

సామాజిక మాధ్యమాల్లో ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణుల నుంచి భారీ స్పందన రావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్‌ అయింది.

Updated Date - Sep 10 , 2026 | 06:32 AM